
నాడు వైఎస్‌ఆర్.. నేడు రేవంత్‌రెడ్డి
నారాయణపేట/ఊట్కూర్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాడు సీఎంగా ఉన్న రాజశేఖరరెడ్డి దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేశారని, మళ్లీ పదిహేనేళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం ఉట్కూరు మండల కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగులు, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూమి కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఊట్కూర్ మండలానికి మంజూరైన 1,261కొత్త రేషన్ కార్డులు, 122 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలతో పాటు మండలానికి చెందిన 14 మంది భూ నిర్వాసితులకు రూ.50 లక్షల నష్టపరిహారం చెక్కులను రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల మంజూరు, నిర్మాణ విషయంలో ఎవరైనా ఒక్క పైసా అడిగినా నేరుగా తనకు ఫోన్ చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం ఉట్కూర్ మండలానికి రూ.25 కోట్ల నిధులతో 500 ఇళ్లు మంజూరు చేశానని, అవి తొందరగా పూర్తి చేసుకుంటే అదనంగా మరో 500 ఇళ్లు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
39 వేల ఎకరాలకు..
జీఓ 69 ద్వారా బీడు వారిన 39 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం లభించిందన్నారు. మండలంలో కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులు 5,045 మందికి ఒకరికి 6 కిలోల చొప్పున ఇచ్చే 30,624 కిలోల సన్న బియ్యం పంపిణీకి నెలకు ప్రభుత్వం రూ.1.40 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. మండలానికి ఓ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామచంద్రనాయక్, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, హౌసింగ్ పీడీ శంకర్‌నాయక్, డీఎస్‌ఓ బాలరాజ్, తహసీల్దార్ సింధూజ, ఇన్‌చార్జి తహసీల్దార్ సతీష్‌కుమార్, ఎంపీడీఓ ధనుంజయ్‌గౌడ్, ఎల్కోటి నారాయణరెడ్డి, ప్రకాష్‌రెడ్డి, యజ్ఞేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీఓ కార్యాలయంలో..
నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న దామరగిద్ద మండలం లింగారెడ్డిపల్లి గ్రామస్తులకు ఆర్డీఓ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ ఆర్.శివారెడ్డితో కలిసి ఆర్డీఓ రాంచందర్‌నాయక్ నష్టపరిహరం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింగారెడ్డిపల్లిలో 1.33 ఎకరాలకు సంబంధించి 11 మంది రైతులకు రూ.26.27 లక్షల విలువ చేసే చెక్కులు అందించామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ దామరగిద్ద మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు ఈదప్ప ఉన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలిచ్చారు..
మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి