
‘అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకోవద్దు’
● ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో నిబంధనలు పాటించాలి
● హౌసింగ్ చీఫ్ ఇంజినీర్ చైతన్య
మద్దూరు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గొప్పలకు పోయి అప్పులు చేసి ఇంటిని నిర్మించుకోవద్దని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని రాష్ట్ర హౌసింగ్ చీఫ్ ఇంజినీర్ చైతన్య సూచించారు. శుక్రవారం ఉమ్మడి మద్దూరు మండలంలోని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న హన్మనాయక్‌తండా, గోకుల్‌నగర్ గ్రామాల్లోని ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. ఈ గ్రామాల్లో ఇప్పటి వరకు ఎన్ని ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు, ఏ ఏ దశల్లో ఉన్నాయని డీఈ హరికృష్ణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామంలో ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే స్టీల్, సిమెంట్ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మే విధంగా చూడాలని, ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు రహ్మతుద్దీన్, వెంకట్‌కృష్ణ, ఎంపీఓ రామన్న, తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్‌గా శ్రీను
నారాయణపేట: స్థానిక అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా శుక్రవారం ఎస్.శ్రీను బాధ్యతలు స్వీకరించారు. కల్వకుర్తి ఆర్డీఓగా పనిచేస్తున్న శ్రీను పదోన్నతిపై నారాయణపేట జిల్లాకు వచ్చారు. అనంతరం ఆయన కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకె అందజేశారు.
30 పోలీస్ యాక్ట్ అమలు
నారాయణపేట క్రైం: శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లావ్యాప్తంగా ఈ నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ యోగేష్‌గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాక్ట్ ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు అమలులో ఉన్నందున పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాళ్లలో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. అనుమతులు లేకుండా పై కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలు, మత విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలను వ్యాప్తి చేసినా వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు.
ఇంజినీరింగ్ కళాశాలలో తుది విడత అడ్మిషన్లు
కోస్గి రూరల్: స్థానిక ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అందుబాటులో ఉన్న నూతన కోర్సు ల్లో చేరేందుకు తుది విడత అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 5న స్లాట్ బుకింగ్, 6న సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, 10న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఈఏపీఈసెట్ అర్హత ఉన్నా, లేకపోయినా ఈ నెల 23న అడ్మిషన్ల కోసం సంప్రదించాలని కోరారు. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్స్, బాలురకు హాస్టల్ వసతి ఉందన్నారు.

‘అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకోవద్దు’

‘అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకోవద్దు’