
అద్దె బస్సు డ్రైవర్ల మెరుపు సమ్మె
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో అద్దె ప్రాతిపదికన నడిపిస్తున్న బస్సుల యజమానులు, డ్రైవర్లు శుక్రవారం మెరుపు సమ్మె చేపట్టారు. ఇటీవల డిపోలో ఆరు కొత్త షెడ్యూల్‌ను తయారు చేసే క్రమంలో హైదరాబాద్ రూట్‌లో నడుస్తున్న అన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసుల ఇన్‌కమింగ్ సమయం దాదాపు గంట పెరిగింది. అదేవిధంగా మహబూబ్‌నగర్‌కు నడిచే పల్లె వెలుగు బస్సులు అప్పక్‌పల్లి వద్ద గల జిల్లా ఆస్పత్రి వరకు లోపలికి వెళ్లి రావాల్సి ఉండటంతో రోడ్డు ఎత్తుగా ఉన్నందున డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో ప్రతి సర్వీస్‌కు ఇవ్వాల్సిన 10 కిలోమీటర్ల అదనపు డబ్బులు చెల్లించలేదు. వీటిపై స్థానిక డిపో మేనేజర్ లావణ్యతో యజమానులు మాట్లాడగా.. ఆమె నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో వారు సమ్మె చేపట్టారు. దీంతో జిల్లా కేంద్రం నుంచి వివిధ మార్గాల్లో రోజువారీగా తిరగాల్సిన బస్సుల్లో సగానికి పైగా నిలిచిపోయాయి.
ఇతర డిపోల నుంచి..
ప్రైవేటు బస్సుల సమ్మెతో నిలిచిపోయిన సర్వీసుల స్థానంలో మహబూబ్‌నగర్, తాండూర్, కోస్గి, గద్వాల డిపోల నుంచి బస్సులను తెప్పించి రద్దీగా ఉన్న మార్గాల్లో నడిపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రయాణికులు బస్సులు చాలక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉన్నతాధికారుల సమీక్ష..
సమ్మైపె కలెక్టర్ సిక్తాపట్నాయక్ స్పందించి డిపో మేనేజర్ లావణ్యతో తన చాంబర్ సమావేశమయ్యారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి మెడికల్ కళాశాల రోడ్డు విషయంలో డ్రైవర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుందామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల సమయపాలన విషయంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వాకబు చేసి ప్రైవేటు బస్సు యజమానులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించినట్లు తెలిసింది. మధ్యాహ్నం తర్వాత మహబూబ్‌నగర్ ఆర్‌ఎం కార్యాలయంలో ప్రైవేట్ వాహన యజమానులతో చర్చలు జరిపినట్లు సమాచారం.
అటెండెన్స్ ఇవ్వకుండా సెలవు వేశారు..
రోజులాగే డిపోకు వచ్చిన కండక్టర్లు చాట్‌లో సంతకాలు చేశారు. అయితే ప్రైవేట్ బస్సులు సమ్మె చేపట్టడంతో అందులో విధులు నిర్వర్తించాల్సిన కండక్టర్లు డిపోకే పరిమితమయ్యారు. అయితే వారు డ్యూటీ కోసం వచ్చినా.. వారి ప్రమేయం లేకుండా బస్సులు ఆగిపోయినా వారికి అటెండెన్స్ ఇవ్వకుండా వ్యక్తిగత సెలవులు ఇచ్చారు. దీనిపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇబ్బందుల్లో ప్రయాణికులు, విద్యార్థులు
రద్దీగా ఉండే మక్తల్, కోస్గి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ రూట్లలో బస్సులు తగ్గిపోగా ఆయా మార్గాల్లో ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పల్లె వెలుగు బస్సులను ఎక్స్‌ప్రెస్‌గా మార్చి పంపించారు. చాలా గ్రామాలకు విద్యార్థుల బస్సులు వెళ్లకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. మరికొందరు పాఠశాలలకు గైర్హాజరయ్యారు.