
సేంద్రియానికి సై..
వివరాలు 8లో u
కోస్గి: వ్యవసాయ రంగంలో వినియోగించే రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలను అమాంతం పెంచేస్తుండటంతో రైతులకు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. వాటి వినియోగంతో ఆశించిన పంటల దిగుబడి రాకపోవడం.. వచ్చిన పంటలో నాణ్యత లోపిస్తుండటంతో రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. విచ్చలవిడిగా రసాయన ఎరువుల వినియోగంతో భూసారం సైతం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కొత్తగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ (ఎన్‌ఎంఎన్‌ఎఫ్) పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు సేంద్రియ విధానంలో పంటల సాగుతో పెట్టుబడులు తగ్గి నాణ్యమైన పంట దిగుబడులు వస్తాయనే విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు లాభాలు వస్తాయని వ్యవసాయ అధికారులు వివరిస్తున్నారు.
పథకం ప్రధాన లక్ష్యం..
వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పంటలకు సైతం కొత్త కొత్త తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. దీంతో రైతులు అధిక ధరలకు క్రిమిసంహారక మందులు కొనుగోలు చేయడం.. అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువులను మోతాదుకు మించి వినియోగిస్తున్నారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో పంటల దిగుబడులు రాకపోవడమే కాకుండా పంటల నాణ్యత సైతం సరిగ్గా ఉండటం లేదు. రోజురోజుకూ భూమిలో సారం కూడా తగ్గిపోతోంది. ఈ పద్ధతి మరింత కాలం కొనసాగితే వ్యవసాయ పొలాలు పంటసాగుకు పనికి రాకుండా పోతాయనే విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు రైతులు మొగ్గు చూపేలా చర్యలు చేపట్టింది. పూర్వకాలంలో ఎలాంటి రసాయన ఎరువులు లేకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో పంటలు సాగుచేసిన విధానాన్ని మళ్లీ అమలు చేయాలని ఎన్‌ఎంఎన్‌ఎఫ్ పథకానికి శ్రీకారం చుట్టింది. దశల వారీగా సేంద్రియ సాగు విస్తీర్ణం పెంచి రసాయన ఎరువుల వినియోగం తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 1,250 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం
ప్రతి క్లస్టర్ నుంచి
125మంది రైతుల ఎంపిక
మట్టి నమూనాల సేకరణలో అధికారుల నిమగ్నం
భూసారానికి అనుగుణంగా సేంద్రియ సాగుపై అవగాహన
రసాయన ఎరువుల వినియోగం తగ్గించడమే లక్ష్యంగా
ఎన్‌ఎంఎన్‌ఎఫ్ పథకం అమలు
సాగు విస్తీర్ణం పెంచుతాం..
పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగం తగ్గించి.. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఎన్‌ఎఫ్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. జిల్లాలో ఈ పథకానికి ఎంపిక చేసిన గ్రామాల్లో రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరిస్తున్నాం. భూమి స్వభావం మేరకు పంటలు సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. భవిష్యత్‌లో సేంద్రియ సాగు దశల వారీగా మరింత పెరిగే అవకాశం ఉంది.
– జాన్‌సుధాకర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

సేంద్రియానికి సై..

సేంద్రియానికి సై..

సేంద్రియానికి సై..