
రోడ్డు విస్తీర్ణం తగ్గించాలని ఆందోళన
మద్దూరు: పట్టణంలోని పాతబస్టాండ్ చౌరస్తా – చింతల్‌దిన్నె రోడ్డు వరకు చేపట్టనున్న రహదారి విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న బాధితులు ఆందోళనకు దిగారు. బుధవారం కలెక్టర్ ఆదేశాల మేరకు రహదారి ఇరువైపులా ఉన్న దుకాణాలు, గృహాల వివరాలతో పాటు యజమానుల ఆర్థిక స్థితి, రోడ్డు విస్తరణతో పూర్తిగా కోల్పోతున్న ఇళ్ల వివరాలు సేకరించేందుకు వచ్చిన మున్సిపల్ సిబ్బందిని బాధితులు అడ్డుకున్నారు. రోడ్డు ఇరువైపులా 35 ఫీట్ల వెడల్పుతో 78 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. రోడ్డు విస్తీర్ణం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది, బాధితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పుర కమిషనర్ శ్రీకాంత్ అక్కడికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పారు. ప్రజాభిప్రాయం మేరకే రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. శుక్రవారం మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని చెప్పారు. పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.