
న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలి
నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం నిర్ణయించేందుకు గాను న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రాం, భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు మశ్చందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో భూ నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు తన భూమిని ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంతోషంగా ఇచ్చే విధంగా ప్రభుత్వం పరిహారం అందించాలన్నారు. నిర్మాణంలో కొంత ఆలస్యమైతే గుత్తేదారులకు ప్రాజెక్టు వ్యయం పెంచే ప్రభుత్వాలు.. భూ నిర్వాసితులకు కాన్సెంట్ అవార్డు పేరుతో అతి తక్కువ పరిహారం ఎకరాకు రూ. 14లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. తరాలుగా సాగుచేసుకుంటున్న తమ భూమిని ప్రాజెక్టుకు అప్పగిస్తున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాచ్వార్, ఎర్నాగన్‌పల్లి గ్రామాల నిర్వాసితులు కలాల్‌రాజు, నగేశ్‌గౌడ్, బస్వరాజ్‌గౌడ్, రఘురెడ్డి, తిమ్మారెడ్డి, రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.