మహానంది: ఎన్నికల బరిలో నిలిచిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడటం అమానుషమని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అన్నారు. నంద్యాల మున్సిపాలిటీలో న్యాయవాదులపై టీడీపీ నేతలు దాడి చేయడం, ఆత్మకూరు మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ ప్రియాంక నామినేషన్ల పత్రం వెంట సమర్పించిన కుల ధృవీకరణ పత్రాన్ని చించేసిన ఘటనపై సోమవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ ప్రియాంకబాయి, నియోజకవర్గ నేత శిల్పా భువనేశ్వరరెడ్డి, నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ రాజకుమారిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ.. నంద్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏనాడు ఇలాంటి దాడుల ఘటనలు జరగలేదన్నారు. నామినేషన్ పత్రాలు చించితే ఎలా అని, నంద్యాల మున్సిపాలిటీలో లాయర్లపై కుర్చీలు, రాడ్లతో దాడి చేయడం చూస్తే ప్రజాస్వామ్య పాలనలోనే ఉన్నామా అని ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపైనే దాడికి దిగితే ఇక సామాన్యులు, ఓటర్ల పరిస్థితి ఎలా అన్నారు. సాక్షాత్తూ పోలీసుల మీదికే టీడీపీ నేతలు దాడికి దిగుతుంటే శాంతి భద్రతలు ఎక్కడున్నాయని ఆవేదన చెందారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలను టీడీపీ అధికార పార్టీ నేతలు గూండాల్లా వ్యవహరిస్తూ రణరంగంగా మార్చుతున్నారని వైఎస్సార్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ నేత శిల్పా భువనేశ్వర రెడ్డి విమర్శించారు. రెండున్నర ఏళ్ల కాలంలో కూటమి నేతలు పానలో అట్టర్‌ప్లాప్ అయ్యారు, అన్ని చోట్లా ఓడిపోతామనే భయంతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయడం ఖామన్నారు.
యువత రాజకీయాల్లోకి రాకూడదా
నేను నిబంధనల మేరకు అన్ని రకాల సర్టిఫికెట్లు సమర్పించాను. నా సర్టిఫికెట్లు చింపేయడం భావ్యం కాదు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా. మహిళలపై దాడి చేయడం అధికారపార్టీ నేతలకు తగదు. యువత రాజకీయాల్లోకి, పైకి రాకూడదా. దసరా నవరాత్రి ఉత్సవాల్లో దేవీ పూజలు చేస్తూ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా. విద్యార్థులు, యువత రాజకీయాల్లోకి రాకూడదా. జెన్‌జీ అడ్డుకుంటే తిరగబడతారనే కూటమి నేతలు తెలుసుకోవాలి.
– డాక్టర్ ప్రియాంక బాయి, వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి, ఆత్మకూరు మున్సిపాలిటీ


