● ఎల్నినో దెబ్బకు దిగుబడి ఢమాల్
● ఎకరాకు 15 నుంచి 18 క్వింటాళ్లలోపే
● రెండేళ్లుగా నష్టాలతో
రైతుల అప్పులపాలు
కోవెలకుంట్ల: ఎల్నినో భయంతో వర్షాధార పంటగా మొక్కజొన్న సాగు చేసినా రైతులు చివరకు నష్టాలే మూటగట్టుకోవాల్సి వచ్చింది. విత్తనం నాటినప్పటి నుంచి ఒక్క దఫా కూడా వర్షం పడకపోవడంతో వర్షాధార పంటలు ఎండిపోగా సాగునీటి వనరుల ఆధారంగా అరకొర దిగుబడులకే పరిమితం కావడంతో అన్నదాతలు కుదేలయ్యారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్లో 61,615 హెక్టార్లలో సాగు సాధారణ విస్తీర్ణం కాగా వర్షాభావ పరిస్థితులు, సాగునీటి వననులు అందుబాటులో లేకపోవడంతో 26,364 హెక్టార్లకే సాగు పరిమితమైంది. ఇందులో జిల్లాలోని కొత్తపల్లి మండలంలో అత్యధికంగా 3,830 హెక్టార్లు, పాములపాడు 3,517, నందికొట్కూరు 3,009, బనగానపల్లె 2,584, పగిడ్యాల 2,326, జూపాడుబంగ్లా 1,943, మిడుతూరు 1,762, రుద్రవరం 1,452, ఆత్మకూరు 1,120, ఆళ్లగడ్డ మండలంలో 1,096 హెక్టార్లలో సాగైంది. మిగిలిన మండలాల్లో వెయ్యి హెక్టార్లలోపే సాగు పరితమైంది. ప్రస్తుతం పంటచేతికందటంతో కోత, నూర్పిడి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు నివారణ, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 35 వేలకు పైగా వెచ్చించారు. సాగునీటి మళ్లింపునకు ఎకరాకు రూ. 5 వేలు అదనపు భారం పడింది. అన్ని కష్టాలు పడి పైరును దక్కించుకున్నా భూమిలో ముందస్తు తేమ లేకపోవడంతో వాతావరణం అనుకూలించక దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఎకరాకు 15 క్వింటాళ్ల నుంచి 18 క్వింటాళ్లకే దిగుబడులు పరమితం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం క్వింటా రూ. 2,500 ధర పలుకుతోంది. ఈ ధర తగ్గకుండా ఇలాగే కొనసాగితే కనీసం పెట్టుబడులైనా వస్తాయని రైతులు అంటున్నారు.
వెంటాడుతున్న నష్టాలు..
గత ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 54,150 హెక్టార్లలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో 55,408 హెక్టార్లలో సాగైంది. బోర్లు, బావులు, చెరువులు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తదితర సాగు నీరు వనరులు అందుబాటులో ఉండటంతో లక్ష్యానికి మించి సాగైంది. ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయనుకుంటే వర్షాభావం, పుప్పడి రాలిపోడం, తెగుళ్లతో ఎకరాకు 20 నుంచి 22 క్వింటాళ్లకే దిగుబడులు పరిమితమయ్యాయి. గిట్టుబాటు ధరలేక క్వింటా రూ. 2 వేల లోపే విక్రయించి నష్టాలు మూటగట్టుకున్నారు. గత రెండేళ్ల నుంచి రైతులకు మొక్కజొన్న సాగు భారంగా మారింది. పంటల బీమా కట్టినా రైతులకు పంటనష్ట పరిహారం, ఇన్సూరెన్స్ అందటం లేదు. గతేడాది మోంథా తుపాన్ కారణంగా వేలాది ఎకరాల్లో పంటనష్టం జరిగినా ఇప్పటి వరకు పంటనష్ట పరిహారం అందలేదు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు తక్కువగా కురుస్తాయని వర్షాభావ పరిస్థితులపై వాతావరణ నిపుణులు పలుసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ రైతులకు భరోసా కల్పించేలా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.


