● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(న్యూటౌన్): ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లను తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో శనివారం ఆర్ఓ, ఎఆర్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణలో కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్ణీత సమయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నామినేషన్లను స్వీకరించాలన్నారు. నామినేషన్లో అభ్యర్థి సమర్పించిన ప్రతి పత్రాన్ని నిశితంగా పరిశీలించాలన్నారు. అభ్యర్థి వివరాలు, సంతకాలు, ప్రతిపాదకుల వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలు, డిపాజిట్ తదితర అంశాలను ఎన్నికల నిబంధనల ప్రకారం ధ్రువీకరించాలన్నారు. నామినేషన్ల పరిశీలన సమయంలో ఎలాంటి సందేహాలకు తావులేకుండా రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన ఫారమ్–7 స్వీకరించాలన్నారు. ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతోపాటు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రియాంక, జిల్లా పరిషత్ సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.


