కర్నూలు: కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలం, డీటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న 2025–26 బ్యాచ్ కానిస్టేబుళ్లకు శనివారం పటాలం గ్రౌండ్‌లో సంయుక్తంగా పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి టీజీ భరత్ గుప్తా, కలెక్టర్ ఎ.సిరి, డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరై కవాతును పరిశీలించి ట్రైనీ కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన లయబద్ధమైన కవాతు, మార్చ్‌ఫాస్ట్ విశేషంగా ఆకట్టుకున్నాయి.
శాంతిభద్రతల పరిరక్షణకు
పాటు పడతామని ప్రమాణం
‘ప్రజల ఆస్తి, ప్రాణాలకు నష్టం రానీయకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తామంటూ ఈ సందర్భంగా ట్రైనీ కానిస్టేబుళ్లతో ప్రమాణం చేయించారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా శాంతిభద్రతల పరిరక్షణకు రాత్రి, పగలు తేడా లేకుండా విధుల్లో నిమగ్నమవుతాం.. వృత్తికి వన్నె తెస్తాం’ అని నూతన పోలీస్ కానిస్టేబుళ్లు ప్రమాణం చేశారు. ఏపీఎస్పీ రెండో పటాలంలో 430 మంది, పోలీసు శిక్షణ కేంద్రంలో 199 మంది కలిపి 629 మంది శిక్షణ పూర్తయింది. తొమ్మిది మాసాలుగా కఠోరమైన శిక్షణతో పాటు పోలీసు విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, సాంకేతికపరమైన అంశాలు బోధించారు. ఇక విధుల్లో చేరడమే మిగిలింది.
సత్తా చాటారిలా..
పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా ట్రైనీలకు పలు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కానిస్టేబుళ్లు తమ ప్రతిభను కనబరచి సత్తా చాటారు. బెస్ట్ ఆల్‌రౌండర్, బెస్డ్ ఇండోర్‌గా నందికం శ్రీనివాసులు, బెస్ట్ ఔట్‌డోర్‌గా ముప్పరి శ్రీకాంత్, బెస్ట్ ఫైరర్‌గా పరస తరుణ్‌కుమార్, పెరేడ్ కమాండర్‌గా అంకెనంద కుమార్ ప్రథమ స్థానంలో నిలిచారు.
ఉద్వేగభరితం
పాసింగ్ ఔట్ పరేడ్‌కు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ట్రైనీ కానిస్టేబుళ్ల తల్లిదండ్రులు, కుటుంబీకులు తమ పిల్లల పరేడ్ చూస్తున్నంత సేపు ఉద్వేగానికి లోనయ్యారు. కళ్లముందు తప్పటడుగులు వేస్తూ పెరిగిన తమ పిల్లలు పోలీసు శిక్షణ పూర్తి చేసుకుని త్వరలో ఉద్యోగంలో చేరనుండటంతో వారంతా ఆనందంలో మునిగారు. పరేడ్ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధిస్తూ మురిసిపోయారు. పరేడ్ ముగిసిన తర్వాత మైదానంలోనే కుటుంబీకులతో కలసి కొత్త కానిస్టేబుళ్లు ఫొటోలు దిగి మధుర క్షణాలను ఆస్వాదించారు. మరికొందరు తమ పిల్లల దగ్గర ఉన్న తుపాకులను తీసుకుని భుజాలపై పెట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చి మురిసిపోయారు.
లక్కింశెట్టి మహేష్
చప్పటి రోహిత్
వెంకటసాయి కృష్ణారెడ్డి
నందికం
శ్రీనివాసులు
మంత్రి నుంచి అవార్డు అందుకుంటున్న పరేడ్ కమాండర్ నందకుమార్
కర్నూలు శివారు జగన్నాథగట్టుపై ఉన్న పోలీసు శిక్షణ కేంద్రంలో పలువురు టాపర్లుగా నిలిచారు. బెస్ట్ ఆల్‌రౌండర్, బెస్ట్ ఇండోర్‌గా చప్పటి రోహి త్, బెస్ట్ ఔట్‌డోర్‌గా లక్కింశెట్టి మహేష్, బెస్ట్ ఫైరర్స్‌గా వెంకటసాయికృష్ణారెడ్డి, అసది శివశంకర్ నిలిచారు. వీరికి మంత్రి చేతుల మీదుగా మెమొంటో అవార్డులు అందజేశారు. అలా గే ఉత్తమ డ్రిల్ ఇన్‌స్ట్రక్టర్లకు కూడా ప్రశంసాపత్రాలు, అవార్డులు అందజేశారు.
డీటీసీలో టాపర్లు వీరే..


