ఎమ్మిగనూరురూరల్: ఎమ్మిగనూరు పట్టణంలో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. రంగారెడ్డి అనే రైతు స్థానిక కెనరా బ్యాంక్ నుంచి రూ. 2 లక్షలు డ్రా చేసుకొని బైక్ ట్యాంక్ కవర్‌లో పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో వైఎస్సార్ సర్కిల్ దగ్గర ఉన్న స్వీట్ స్టాల్ ముందు బైక్ నిలిపి లోపలికి వెళ్లాడు. అప్పటికే బ్యాంక్ నుంచి అనుసరిస్తూ వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్యాంక్ కవర్‌లో ఉంచిన రూ. 2 లక్ష నగదును ఎత్తుకెళ్లిపోయాడు. స్వీట్ స్టాల్ నుంచి బయటకు వచ్చిన రైతు రంగారెడ్డికి డబ్బులు కనిపించకపోవటంతో వెంటనే పట్టణ పోలీసుకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్వీట్ స్టాల్ దగ్గర ఉన్న సీసీ పుటేజీని పరిశీలించగా ఓ వ్యక్తి బైక్ నుంచి డబ్బులు తీసుకెళ్లిన దృశ్యాలు కనించాయి. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు టౌన్ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
మల్లన్న సేవలో
లోకాయుక్త న్యాయమూర్తి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఏపీ లోకాయుక్త న్యాయమూర్తి టీ.మల్లికార్జునరావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శనివారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన న్యాయమూర్తికి దేవస్థాన చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావు, అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఏపీ లోకాయుక్త న్యాయమూర్తి టీ.మల్లికార్జున రావు దంపతులు మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం వారికి వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలను అందించారు. అనంతరం న్యాయ మూర్తి దంపతులకు దేవస్థాన చైర్మన్, ఈఓ స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు.
ఆదోని: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పెద్దహరివాణం 30 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని స్టాఫ్ నర్స్‌కు వైద్యాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి వైద్య సేవలు అందించేందుకు ఎవరూ అందుబాటులో లేరు. బంధువులే పురుడు పోసి కాపాడారు. ఈ క్రమంలో ‘గర్భిణికి బంధువులే పురుడు పోశారు’ అనే శీర్షికన సాక్షిలో శనివారం వెలువడిన వార్తకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. ఆదోని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సత్యవతి ఉదయం హుటాహుటిన పెద్దహరివాణం ఆరోగ్య కేంద్రానికి చేరుకుని విచారణ చేపట్టారు. వైద్య సేవలు పొందుతున్న బాలింత పవిత్ర, బిడ్డ ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో విధుల్లో ఉన్న సిబ్బందిని, రాత్రి డ్యూటీ వివరాలను తెలుసుకున్నారు. నైట్ డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సు తన తర్వాత నర్సు వచ్చే వరకు విధుల్లో ఉండాల్సి ఉన్నప్పటికీ ఎవరికీ చెప్పా పెట్టకుండా ముందుగానే వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఈ మేరకు సదరు స్టాఫ్ నర్సుకు షోకాజ్ నోటీసును జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు.


