కర్నూలు(అగ్రికల్చర్): పశుబీమా పథకం కింద పాడి ఆవులు, గేదెలకు కూడా బీమా చేసుకోవచ్చని జిల్లా పశుసంర్ధక శాఖ అధికారి డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఇది వరకు సన్న జీవాలకు మాత్రమే బీమా సదుపాయం ఉందని, తాజాగా ఆవులు, బర్రెలకు కూడా బీమా చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. నాటు ఆవులు, బర్రెలకు రూ.15 వేల విలువకు బీమా చేసుకోవచ్చని, ప్రీమియం రూ.960 ఉండగా... ప్రభుత్వం రూ.816 భరిస్తుందని, రైతులు రూ.149 చెల్లించాల్సి ఉంటుందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతి ఆవులు, గేదెలకు రూ.30 వేల విలువకు బీమా చేసుకోవచ్చని, ప్రీమియం రూ.1920 చెల్లించాల్సి ఉందని, ఇందులో ప్రభుత్వం రూ.1,623 సబ్సిడీ ఇస్తుందని, రైతులు రూ.298 భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కర్నూలు డివిజన్‌లో 50 పశువులు, ఆదోని డివిజన్‌లో 35 పశువుల ప్రకారం బీమా చేసే విధంగా లక్ష్యాలను ఇచ్చినట్లు తెలిపారు. గొర్రెలు, మేకలకు 1 నుంచి 3 ఏళ్ల వరకు బీమా చేసుకోవచ్చని తెలిపారు. రూ.6 వేల విలువకు ఏడాదికి రూ.180, రెండేళ్లకు రూ.270, మూడేళ్లకు రూ.375 ప్రీమియం చెల్లించాల్సి ఉందని, అయితే సబ్సిడీ పోనూ...గొర్రెల పెంపకం దారులు రూ.27, రెండేళ్లకు రూ.40, మూడేళ్లకు రూ.56 ప్రకారం భరించాల్సి ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు, గొర్రెల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాకు సబ్సిడీ ఇచ్చేందుకు రూ.15 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.
కొలిమిగుండ్ల(అవుకు): వినాయక నిమజ్జనం సందర్భంగా ఈనెల 16వ తేదీన పట్టణంలోని చెన్నకేశవస్వామి ఆలయ సమీపంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ అశోక్‌తో కలసి బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథరెడ్డి నిందితుడి వివ రాలను వెల్లడించారు. నిమజ్జనం కోసం వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా ఉయ్యాలవాడ మధు సుధాకర్‌తో ఘర్షణ పడిన వెంకటేష్‌గౌడ్ వెంట తెచ్చుకున్న కత్తితో ఛాతీలో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడే చికిత్స పొందుతూ 22వ తేదీ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు వెంకటేష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసుకున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టగా హతుడి భార్యతో నిందితుడు వివాహేతర సంబంధం ఉందని, ఈ క్రమంలో అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో మధు సుధాకర్‌ను కత్తితో దాడి చేశాడని దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిసిందని సీఐ తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.


