హుండీ ఆదాయం రూ.40 లక్షలు | - | Sakshi
Sakshi News home page

హుండీ ఆదాయం రూ.40 లక్షలు

Aug 20 2026 3:52 AM | Updated on Aug 20 2026 3:52 AM

పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయలంలో బుధవారం హుండీలోని కానుకలను లెక్కించారు. ఈ సందర్భంగా ఈఓ రామకృష్ణ మాట్లాడుతూ హుండీలో నగదు రూ. 40.93 లక్షలు, 1. 20 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండిని భక్తులు బహూకరించినట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చి 26 నుంచి నేటి వరకు భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కించినట్లు పేర్కొన్నారు.

డ్రంకెన్‌డ్రైవ్‌లో ఇద్దరికి జైలు

డోన్‌ రూరల్‌: డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరికి జైలు శిక్ష, ఒకరికి రూ.10 వేలు జరిమానా విధించారు. విజయవాడలోని కుమ్మరిపాలెం వీధికి చెందిన జరకు రవి శేఖర్‌రెడ్డికి ఏడు రోజుల జైలు శిక్ష, డోన్‌ పాతపేటకు చెందిన ఎం శ్రీనివాసులుకు మూడు రోజులు జైలు శిక్ష, డోన్‌ చిగురుమానుపేటకు చెందిన జి అంజికు రూ.10 వేల జరిమానా విధిస్తూ బుధవారం డోన్‌ స్పెషల్‌ జ్యూడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు టౌన్‌ సీఐ ఇంతీయాజ్‌ బాషా తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమానాలు ,జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు.

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

నంద్యాల(అర్బన్‌): పర్యాటక, మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా టూరిజం అధికారి సునిల్‌కన్న తెలిపారు. స్థానిక పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో కోర్సులు ఉన్నాయన్నారు. బీఎస్సీ మూడేళ్ల డిగ్రీ కోర్సుకు ఇంటర్‌ పాస్‌ అయిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ పాస్‌ అయిన విద్యార్థులు క్రాప్ట్‌ కోర్స్‌ ఇన్‌ఫుడ్‌ ప్రొడక్షన్‌, సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ఫుడ్‌, బేవరేజ్‌ సర్వీస్‌ కోర్స్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పై కోర్సులకు వయో పరిమితి లేదని, బాలబాలికలకు లోన్‌ సదుపాయంతో పాటు వేర్వేరుగా హాస్టల్‌ సదుపాయం ఉంటుందన్నారు. వివరాలకు 9701343846, 9700440604 నంబర్లను సంప్రదించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 29లోగా కాలేజీకి పంపాలన్నారు. కార్యక్రమంలో శివరామకృష్ణ, భార్గవి పాల్గొన్నారు.

క్వింటా ఉల్లి రూ.3,813

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉల్లిగడ్డలకు డిమాండ్‌ పెరగడంతో వ్యాపారులు క్షేత్రస్థాయికే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. దాదాపు 15 రోజులుగా మార్కెట్‌కి ఉల్లిగడ్డలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరగడంతో వ్యాపారులు కొనుగోళ్లపై దృష్టి సారించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన ఉల్లిలో 75 శాతం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి వెళ్తోంది. దీంతో వ్యాపారులు క్షేత్రస్థాయికే వెళ్లి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం కర్నూలు మార్కెట్‌కు కేవలం ముగ్గురు రైతులు 185 క్వింటాళ్ల ఉల్లి తెచ్చారు. కనిష్ట ధర రూ.3,589, గరిష్ట ధర రూ.3,813 లభించగా.. సగటు ధర రూ.3803 నమోదైంది. వేరుశనగకు కర్నూలు మార్కెట్‌లో గరిష్టంగా రూ.9,270, ఆదోని మార్కెట్‌లో రూ.8,891, ఎమ్మిగనూరు మార్కెట్‌లో రూ.8,304 ప్రకారం ధరలు లభించాయి. ఆదోని మార్కెట్‌లో పత్తి ధర కాస్త తగ్గింది. మార్కెట్‌కు 678 క్వింటాళ్ల పత్తి రాగా.. కనిష్ట ధర రూ.4వేలు, గరిష్ట ధర రూ.9,929 లభించగా.. సగటు ధర రూ.9,570 నమోదైంది.

కర్నూలు జిల్లాకు 1,078 పశువుల షెడ్లు మంజూరు

కర్నూలు(అగ్రికల్చర్‌): వీబీ జీ రామ్‌ జీ నిధులతో 1,078 పశువుల షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఉపాధి హామీ జాబ్‌కార్డుతో పాటు గ్రామసభ ఆమోదం తప్పనిసరి చేశారు. 2, 4, 6 పశువులకు షెడ్లు నిర్మించుకోవడానికి 90 శాతం వీబీ జీ రామ్‌ జీ నిధులు వినియోగిస్తారు. పశుసంవర్ధక శాఖ అధికారులు పాడి పశువులు ఉన్న రైతులను గుర్తించి జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులకు అప్పగిస్తామని జిల్లా పశసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. డ్వామా సాంకేతిక సహాయకులు, ఈసీలు ఎస్టిమేట్లు వేసి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌కు పంపుతారన్నారు. యూనిట్‌ కాస్ట్‌లో 90 శాతం సబ్సిడీ ఇస్తుండగా.. 10 శాతం రైతులు భరించాల్సి ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement