ప్రభుత్వ సొసైటీలో ప్రైవేటు ఉత్పత్తుల అమ్మకాలపై చర్యలేవీ? అనర్హులకు తంగడంచ చెరువు పునరుద్ధరణ పనులు ఉమ్మడి జిల్లాలో ఆర్‌అండ్‌బీ మంత్రి ఉన్నా రోడ్లు అధ్వానం హుందాగా సాగిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి జిల్లాలోని రిజర్వాయర్లను నింపుకోవడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ఏడాది సాగు, తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం జెడ్పీలో స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్ని రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటాయన్నారు. 2025–26లో కురిసిన వర్షాల వల్ల 1651.380 టీఎంసీల వరద నీరు సముద్రం పాలైందన్నారు. వరద నీటిని నింపుకునేందుకు అవసరమైనన్ని రిజర్వాయర్లు లేకపోవడం, అధికారులు ముందుచూపుతో ఆలోచన చేయకపోవడం వల్ల ఈ ఏడాది ప్రజలు సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 9.725 టీఎంసీలు మాత్రమే నీరు ఉందన్నారు. ఖరీఫ్‌లో ఎల్‌ఎల్‌సీ కింద నీటిని ఇవ్వలేమని టీబీ బోర్డు అధికారులు ప్రకటించారన్నారు. అలాగే ముందు నుంచి జెడ్పీ సమావేశాల్లో చెప్పడం వల్ల జీడీపీలో 4.5 టీఎంసీలకుగాను ఇప్పటికీ 2.67 టీఎంసీలు ఉన్నాయన్నారు. మిగిలిన రిజర్వాయర్లలో నీరు అడుగంటాయన్నారు. సుంకేసులలో 0.881 టీఎంసీలు, క్రిష్ణగిరిలో 0.013, జుర్రేరులో 0.11, అలగనూరులో జీరో, శ్రీశైలంలో 42.21 టీఎంసీలు, వెలుగోడులో 1.857, గోరుకల్లులో 2.605 టీఎంసీలు, అవుకు రిజర్వాయర్‌లో 0.788, వీఆర్‌ఎస్‌పీలో 0.027, పందికోనలో 0.67, పులికనుమలో 0.14 టీఎంసీలు ఇలా.. అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టం డెడ్ స్టోరేజ్‌కు చేరుకుందని ఛైర్మన్ పాపిరెడ్డి వివరించారు. వరద నీటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమై, మరోవైపు వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు ‘జలధార ● జల హారతి’ కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు.
● కొలిమిగుండ్ల మండలం హనుమంతుగుండం సొసైటీలో యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్నారని దీనికి రసీదులు కూడా ఉన్నాయని చైర్మన్ అన్నారు. యూరియా బస్తా రూ.267కు అమ్మాల్సి ఉండగా రూ.290లకు అమ్ముతున్నారని, పైగా నానో డీఏపీ కొంటేనే యూరియా ఇస్తామని షరతు విధించడంతో విధి లేని పరిస్థితుల్లో లీటర్ నానో డీఏపీకి రూ.500 చెల్లించి రైతులు యూరియాను తీసుకువెళ్తున్నారన్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
● జెడ్పీ సర్వసభ్య సమావేశాలు, స్థాయీ సంఘ సమావేశాల ప్రాధాన్యతను అధికారులు గుర్తించాలని చైర్మన్ అన్నారు. మొక్కుబడిగా ద్వితీయ శ్రేణి అధికారులు, కార్యాలయ పర్యవేక్షకులను సమావేశాలకు పంపి అధికారులు చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
● బ్యాంకర్ల నిర్లక్ష్యం వల్ల పేదలకు సబ్సిడీపై అందాల్సిన అనేక పథకాలు అందడం లేదని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆరోపించారు. జిల్లాలో 25 వేల మంది కౌలు రైతులు ఉంటే కేవలం 400 మందికి మాత్రమే రుణాలు ఇచ్చారన్నారు.
● నందికొట్కూరు నియోజకవర్గంలోని తంగడంచె చెరువు పునరుద్ధరణ పనులను మైనర్ ఇరిగేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు కేటాయించారని జూపాడుబంగ్లా జెడ్పీటీసీ సభ్యుడు పోచా జగదీశ్వరరెడ్డి లేవనెత్తారు. చెరువు పనులకు అధికారులు రూ.42 లక్షల అంచనాతో టెండర్లు పిలవగా మూడు ఏజెన్సీలు పాల్గొన్నాయన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుభవం లేని సుజిత్‌రెడ్డి ఏజెన్సీకి పనులు అప్పగించేందుకు ఎల్‌ఓఏ (లెటర్ ఆఫ్ అగ్రిమెంట్) ఇచ్చారని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
● గూడురు మండలంలో గత మూడు దఫాలుగా 286 మంది అర్హులైన రైతులకు పీఎం కిసాన్ నిధులు జమ కాలేదని జెడ్పీటీసీ మౌలాలి లేవనెత్తారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని వాపోయారు.
ఆర్‌అండ్‌బీ మంత్రి ఉన్నా రోడ్లు అధ్వానం
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఉమ్మడి జిల్లాకు చెందిన వారైనా జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని కోడుమూరు, జూపాడుబంగ్లా జెడ్పీటీసీలు బీ.రఘునాథరెడ్డి, పోచా జగదీశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. కోడుమూరు – వెల్దుర్తి రోడ్డు పనులు నెలల తరబడి నిలిచిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. కోవెలకుంట్ల పట్టణంలో నంద్యాల, ఆళ్లగడ్డకు వెళ్లే రోడ్డుపై పెద్ద గుంతలు పడ్డాయన్నారు. ఆలూరులో రోడ్డుపై ప్రమాదకర గుంత ఉందని ఎర్రజెండాను పెట్టారన్నారు. జెడ్పీ ఇన్‌చార్జ్ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.


