● బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో పెద్దకడబూరుకు చెందిన దంపతుల దుర్మరణం ● భార్య గర్భంలోని శిశువు కూడా మృతి ● అనాథగా మిగిలిన బాలుడు | - | Sakshi
Sakshi News home page

● బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో పెద్దకడబూరుకు చెందిన దంపతుల దుర్మరణం ● భార్య గర్భంలోని శిశువు కూడా మృతి ● అనాథగా మిగిలిన బాలుడు

Jul 8 2026 1:26 AM | Updated on Jul 8 2026 1:26 AM

● బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో పెద్దకడబూరుకు చెందిన దంపతుల దుర్మరణం ● భార్య గర్భంలోని శిశువు కూడా మృతి ● అనాథగా మిగిలిన బాలుడు

పచ్చని కుటుంబంపై మృత్యుపంజా

పెద్దకడబూరు: రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టింది. జీవితాంతం కలిసి ఉండాలని కలలుగన్న దంపతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. ఈ ఘటనతో భార్య గర్భిణి కాగా ఇంకా లోకాన్ని చూడని ప్రసి ప్రాణం కూడా వారితోనే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన బెంగళూరు పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు.. పెద్దకడబూరుకు చెందిన గుమ్మల చార్లెస్‌, మేరమ్మ దంపతులకు నలుగురు సంతానం. మొదటి కుమారుడు గుమ్మల వినోద్‌ (32) దాదాపు పదేళ్ల కిందట బతుకుదెరువు కోసం కడప పట్టణానికి వలస వెళ్లాడు. అక్కడ పని ప్రదేశంలో జుబేద (ముస్లిం యువతి)ని నాలుగున్నరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. తర్వాత భార్యను తీసుకొని బెంగళూరుకు వలస వెళ్లాడు. వారికి కుమారుడు గుమ్మల ఇషాక్‌ (3) ఉన్నాడు. ఈ క్రమంలో పెద్దకడబూరులో నూతన చర్చ్‌ ప్రారంభోత్సవంలో భాగంగా రెండు నెలల క్రితం సొంత గ్రామానికి వచ్చారు. 15 రోజుల క్రితం ఇషాక్‌ను తన తల్లిదండ్రుల వద్ద తిరిగి బెంగళూరుకు వెళ్లారు. ప్రస్తుతం భార్య 6 నెలల గర్భిణి. భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మంగళవారం మధ్యాహ్నం బైక్‌పై ఇద్దరు బయలుదేరారు. కేజీ నేలగులి (హోసపాడు వద్ద) ట్రక్‌ ఢీకొని వినోద్‌ అక్కడికక్కడే చనిపోగా జుబేదాను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గర్భంలోని శిశువుతో సహా ఆమె చనిపోయింది. దీంతో చిన్నారి ఇషాక్‌ అనాథగా మిగిలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ విషాద ఘటన గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వై.బాలనాగిరెడి

రోడ్డు ప్రమాదంలో వినోద్‌ దంపతుల దుర్మరణం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫోన్‌లో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి అండగ ఉంటామని భరోసా ఇచ్చారు. బెంగళూరు నుంచి మృతదేహాలను తీసుకొనిరావడం, ఇతర ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. తక్షణమే పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement