వేద పాఠశాలకు భూమిపూజ
ఓర్వకల్లు: మండల కేంద్రానికి సమీపాన వేద పాఠశాల నిర్మాణానికి శంకరాచార్య విధుశేఖర భారతీ మహాస్వామి భూమిపూజ నిర్వహించారు. శృంగేరి పీఠాధిపతి శిష్యులు, విద్యాభారతి వేద పీఠం వ్యవస్థాపకులు, గ్రామానికి చెందిన విరివింటి ఫణిశశాంక శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన భూమిపూజ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విధుశేఖర భారతీ మహాస్వామితో పాటు, స్థానిక ఎమ్మెల్యే గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి, మండల మహిళా సమాఖ్య గౌరవ సలహాదారు విజయభారతి, జిల్లా న్యాయమూర్తి కబర్ది దంపతులు హాజరయ్యారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా విధుశేఖర భారతీ మహాస్వామి మంగళవారం ఉదయం స్థానిక జీవేశ్వ ర స్వాముల వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలభారతి పాఠశాల సమీపంలో విద్యాభారతి వేద పీఠం పేరుతో నూతనంగా నిర్మించనున్న వేద పాఠశాలకు శాస్త్రోక్తంగా విశిష్ట పూజలు జరిపి, భూమిపూజ నిర్వహించారు. మేళతాళాలు, భాజా భజంత్రీల మధ్య స్వా ముల వారి ధర్మవిజయ యాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. అనంతరం బాలభారతి పాఠశాలలో జగద్గురువుల దర్శనం, పాదుకా పూజ, ఆశీర్వచనం, ధార్మిక ప్రవచనాలు, తీర్థప్రసాదాల వితరణ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాధ్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రంగనాథ్‌రెడ్డి, స్థానిక నాయకులు శంకర్‌రెడ్డి, రాజేంద్రారెడ్డి, జికె.వెంగన్న తదితరులు స్వాముల వారి ఆశీస్సులు పొందారు. స్థానిక ఎస్‌ఐ సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు.


