టీడీపీ నాయకులకు కప్పం కట్టలేక అజ్ఞాతంలోకి కాంట్రాక్టర్లు
ఆలయ జీర్ణోద్ధరణ పనుల్లో వాటా అడగడం దారుణం
పాదయాత్రలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
డోన్: టీడీపీ నేతలు కమీషన్ల కోసం అభివృద్ధిని అడ్డుకోవడం దారుణమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. రూ. 50 కోట్లతో గత ప్రభుత్వంలో చేపట్టిన ఆలయాల జీర్ణోద్ధరణ పనులు నిలిచిపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం ఆయన కొట్రాయి గ్రామం నుంచి లక్ష్మీ చెన్న కేశవ స్వామి కొలువైన ఎస్. గుండాల గ్రామం వరకు 3 కి.మీ పాదయాత్ర చేపట్టారు. కొత్తకోట, తిరునాంపల్లి, నక్కలవాగుపల్లి, కొట్రాయి, గుండాల, చను గొండ్ల గ్రామాల ప్రజలు అడుగడునా బుగ్గనకు ఘన స్వాగతం పలికారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. రూ.2 కోట్లతో నిర్మిస్తున్న లక్ష్మీ చెన్న కేశవ స్వామి గర్భగుడిని ఆయన నిశితంగా పరిశీలించారు. గత వైభవం ప్రాచీన శిల్పకళా సంపద దెబ్బతినకుండా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. పాదయాత్ర చేసిన అనంతరం చెన్న కేశవ స్వామి ఆలయం వద్ద పాత్రికేయులతో మాట్లాడారు.
టీడీపీ నేతలు.. అభివృద్ధి నిరోధకులు
నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అసంపూర్తిగా ఉన్న వాటిని తిరిగి ప్రారంభించాలంటే టీడీపీ నాయకులకు కాంట్రాక్టర్లు కప్పం ముట్టజెప్పాల్సిందేనని విమర్శించారు. రూ.400 కోట్లతో ప్రారంభించిన గోరుకల్లు వాటర్ గ్రిడ్ పథకం, రూ.220 కోట్లతో హంద్రీ నీవా కాలువ నుంచి చెరువులను నింపే పథకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల నుంచి టీడీపీ నేతలు మామూళ్లు వసూలు చేశారన్నారు. రూ.50 కోట్లతో చేపట్టిన ఆలయాల జీర్ణోద్ధరణ పనుల్లో వాటా కావాలని అధికార పార్టీ నేతలు వేధించడంతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలో నిలిపేసి ఆజ్ఞాతంలోకి వెళ్లారన్నారు. వీటితో పాటు ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే డ్రైవర్ల శిక్షణా కేంద్రం, పలు కళాశాలలు, వసతి గృహాలు, పాఠశాలల నూతన భవనాలు నిర్మించే కాంట్రాక్టర్లను సైతం కమీషన్ల కోసం వేధించడంతో పనులన్నీ మధ్యలో ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అభివృద్ధి నిరోధకులకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
ప్రజల ఆగ్రహం
రూ.5 కోట్లతో నిర్మించిన టీటీడీ కల్యాణ మండపాన్ని మాజీ మంత్రి బుగ్గన తమ పర్యటనలో భాగంగా పరిశీలిస్తారని ముందుగానే పసిగట్టిన అధికార పార్టీ నేతలు ప్రధాన గేటుకు తాళం వేయాలని ఎండోమెంట్ అధికారులపై ఒత్తిడి తేవడంతో ప్రజలు అధికార పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కల్యాణ మండపంలోనే సీఎం కొత్త బురుజు గ్రామ పర్యటన సందర్భంగా అధికారులు బస చేసిన సంగతిని మాజీ మంత్రి గుర్తు చేశారు. మారుమూల ప్రాంతం అయిన గుండాల గుడి జీర్ణోద్ధరణ పనులు, కల్యాణ మండపం, అందమైన రహదారులు, కనీస సౌకర్యాలు గత ప్రభుత్వ హయాంలో కల్పించడంతో ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని బుగ్గన అన్నారు.
ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే తప్పుడు కేసులు
డోన్: ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వం అంతులేని అవినీతి, అక్రమాలకు పాల్పడడమే కాక హింసాత్మక ఘటనలను ప్రోత్సహిస్తోందన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అణచివేత ధోరణి అవలంబిస్తున్నారన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో టీడీపీ కూటమి నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎన్నో ఆశలతో టీడీపీ, కూటమి ప్రభుత్వానికి బాసటగా నిలిచిన ప్రజల నోట్లో మట్టి కొట్టారని బుగ్గన ఎదేవా చేశారు. ఆకర్షణీయమైన అబద్ధ్దాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజల ఆశలను వమ్ము చేసిందన్నారు. అమాయకులపై రౌడీషీటర్ల ముద్ర వేసి స్టేషన్‌లోనే దారుణంగా హత్య చేసి అనవాళ్లు లేకుండా చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీ, కూటమి నేతల ముసుగులోని అరాచక నేతలకు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.


