వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకురాలు కల్పలతారెడ్డి
నంద్యాల: వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు సంబంధించి ఒక్క ఓటు కూడా తొలగిపోకూడదని, సర్ కార్యక్రమం పట్ల బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు కల్పలతారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, నియోజకవర్గ పరిశీలకులతో సర్ సర్వే తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. సర్ కార్యక్రమంలో ఎలాంటి అనుమానాలు వచ్చినా పార్టీ నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఓట్లు తీసివేయడానికి టీడీపీ నాయకులు కుట్రపన్నే అవకాశం ఉందని, ప్రతీది గమనిస్తూ ఉండాలన్నారు. అధికారులు కూడా నిష్పక్షపాతంగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈనెల 14వ తేదీలోపు ప్రతి ఓటరు నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన పత్రాలతో వెరిఫికేషన్ పూర్తి చేసుకొని ఓటు హక్కు పొందాలన్నారు. ఎన్యుమరేషన్ పత్రాలను సమర్పించడానికి కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు. ఇంత తక్కువ సమయంలో పూర్తి కావడం కష్టమవుతుందని, కావున ఎన్యుమరేషన్ పత్రాలను సమర్పించేందుకు కేటాయించిన గడువును అధికారులు పొడిగించాలన్నారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాససెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని కూటమి నాయకులు ధ్వంసం చేశారని, ఈ స్థానంలో కాంస్య విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరిస్తున్నామన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, డోన్, నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ పరిశీలకులు సద్దల సూర్యనారాయణరెడ్డి, గుండం సూర్యప్రకాష్‌రెడ్డి, భూమా కిశోర్‌రెడ్డి, దేశం సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


