నంద్యాల(వ్యవసాయం): కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ మూడు రోజులపాటు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జీవీఎన్ ప్రసాద్, ప్రతాపరెడ్డి, గౌరీశంకర్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇంతవరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయలేదన్నారు. అందుకు నిరసనగా ఈనెల 8, 9, 10 తేదీలలో మూడు రోజుల పాటు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు త్వరగా ఈ నిర్ణయాన్ని ప్రకటించి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఉద్యమం చేపడుతామని నాయకులు తెలిపారు.
కేజీబీవీలో మరో బాలికకు గొంతు వ్యాధి
రుద్రవరం: మండల కేంద్రమైన రుద్రవరం కేజీబీవీలో కొద్ది రోజుల నుంచి బాలికలు గొంతు వ్యాధి బారిన పడుతున్నారు. శ్వాస ఆడక మాటలు సరిగా రాక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే నలుగురు ఈ వ్యాధి బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు సోమవారం పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టి .. కాఫ్, కోల్డ్ (దగ్గు, జలుబు) కారణమంటూ వెళ్లిపోయారు. వారు వెళ్లిన మరుసటి రోజు మంగళవారం 9వ తరగతి విద్యార్థిని సుస్మితకు గొంతు వ్యాధి సోకింది. స్థానిక పీహెచ్‌సీ వైద్యులు పరిశీలించి నంద్యాలకు రెఫర్ చేయగా నంద్యాలలోని ఓ వైద్యశాలలో చికిత్సలు చేయించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఇలా వరుసగా బాలికలు అస్వస్థతకు గురి కావడతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేజీబీవీలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలని బాలికల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోండి
డోన్ టౌన్: జైల్లో ఉన్న ఖైదీలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. ఆయన మంగళవారం డోన్ పట్టణంలోని సబ్ జైల్‌ను తనిఖీ చేసి ఖైదీలతో సమావేశమయ్యారు. ఆర్ధిక పరిస్థితులతో న్యాయవాదిని నియమించుకోలేని ఖైదీలకు ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ నెల 11వ తేదీ జరిగే జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూసించారు. కార్యక్రమంలో డోన్ న్యాయమూర్తులు వినోద్, జ్యోతి, న్యాయవాది మాధవస్వామి, సబ్ జైలు సూపరింటెండెంట్ సురేష్, కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు.


