ఆరోగ్యశ్రీ ఉన్నా అదనం చెల్లించాల్సిందే
ప్రైవేటు ఆసుపత్రుల్లో వసూళ్ల పర్వం
యథేచ్ఛగా మెడికల్ దందా
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి జిల్లాలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) కింద 69 ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు నమోదయ్యాయి. వీటితో పాటు ప్రభుత్వ పలు ఆస్పత్రులను సైతం ఇందులో కొనసాగిస్తున్నారు. రోగికి వచ్చిన వ్యాధి, చికిత్సను బట్టి ప్రభుత్వం ప్యాకేజీలను నిర్ణయించింది. మార్కెట్‌కు అనుగుణంగా ఐదారేళ్లకు ఒకసారి ధరలను సవరిస్తూ వస్తున్నారు. అయితే చిన్న పట్టణా ల్లో ఉండే ప్రైవేటు ఆసుపత్రులకు ఈ ప్యాకేజీలు సరిపోతాయని, తమ ఆసుపత్రులకు సరిపోవని కర్నూలు లాంటి నగరాల్లో ఉండే ఆసుపత్రుల యాజమాన్యాలు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. రోగి చికిత్స కోసం రాగానే, ఆరోగ్యశ్రీ కింద వచ్చే ప్యాకేజీ సరిపోదని అదనంగా ఇంత ఇస్తేనే చికిత్స చేస్తామని తెగేసి చెబుతున్నారు. ఇష్టమంటే ఇక్కడ చేయించుకోవాలని, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని మరీ సూచిస్తున్నారు. అలాగే అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చిన విషయం చెప్పకూడదని ముందుగానే హెచ్చరిస్తున్నారు. దీంతో తనిఖీల సమయంలో రోగులు ఫిర్యాదు చేయడం లేదు. అయితే ఐవీఆర్‌ఎస్ కాల్స్‌కు స్పందించి పలువురు ఆసుపత్రులపై ఫిర్యాదు చేస్తుండటం గమనార్హం. గత మే, జూన్ నెలల్లో జిల్లాలో 30కి పైగా ఫిర్యాదులు వెళ్లడం గమనార్హం. ఈ అదనపు వసూళ్లకు అడ్డుకట్ట వేయాలంటే అధికారులు డెకాయిట్ ఆపరేషన్ చేయాలని పలువురు సూచిస్తున్నారు.
ఈహెచ్‌ఎస్, జర్నలిస్ట్ హెల్త్‌కార్డులకు
నో ట్రీట్‌మెంట్
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ కార్డులపై తాము చికిత్స అందించలేమని ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి. తాము చికిత్స చేసినా ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించి డబ్బులు రావడం లేదని ఆయా యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఆసుపత్రులకు వెళ్లి స్కీమ్‌లు వర్తించక ఉద్యోగులు, జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అప్పులు చేసి చికిత్స చేయించుకుంటున్నారు.
కర్నూలు నగరంలోని బుధవారపేటకు చెందిన అనీల్‌కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా కొందరు దళారులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్ చేయాలంటే ఆరోగ్యశ్రీతో పాటు అదనంగా రూ.10 వేలు చెల్లించాలని చెప్పి మరీ వసూలు చేశారు.
కర్నూలు మండలం రుద్రవరానికి చెందిన రాముడుకు కడుపునొప్పి తీవ్రం కావడంతో వారం రోజుల క్రితం కొత్తబస్టాండ్ సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. వైద్యులు పరీక్షించి అపెండిక్స్ పగిలిందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి ఆరోగ్యశ్రీ ఉన్నా అదనంగా రూ.30 వేలు వసూలు చేశారు.
వీరిద్దరూ కాదు ఆరోగ్యశ్రీ కార్డు జేబులో పెట్టు కుని ఏ నెట్‌వర్క్ ఆసుపత్రికి వెళ్లినా ఇదే తంతు నడుస్తోంది. ఆరోగ్యశ్రీ ఉన్నా అదనంగా డబ్బులు చెల్లిస్తేనే చికిత్స చేస్తామని నెట్‌వర్క్ ఆసుపత్రులు బాహాటంగా వసూలు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ సరిపోదంటూ దాదాపుగా అన్ని ఆసుపత్రులు రోగుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి.


