డోన్ రూరల్(ప్యాపిలి): మండలంలోని నల్లమేకలపల్లె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం గ్రామ సమీపంలోని కుంటలో గొర్రె పిల్లలను కాపాడేందుకు వెళ్లి చిన్న నాగన్న (23) నీట మునిగి మృతి చెందారు. జలదుర్గం ఎస్‌ఐ అనిల్‌కుమార్, అగ్ని మాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడంతో మోటారు సాయంతో నీటిని బయటకి పంపేలా చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం మృతదేహం కనిపించింది. మృతదేహం నీటి కుంటలో చిక్కుకొని ఉండగా గజ ఈతగాళ్ల సహాయంతో వెలికితీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు జలదుర్గం ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు.
జలపాతం వద్దకు వెళ్లి
మృత్యువాత
సి.బెళగల్: మండల కేంద్రానికి చెందిన యువకుడు తాడా జలపాతం (ఉబ్బల మడుగు జలపాతం)లో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. సి.బెళగల్‌లో నివాసం ఉంటున్న కేశవులు, జయలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు నరేష్ (25) కొన్నేళ్లుగా తిరుపతిలోని ప్రైవేట్ హాస్టల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. నరేష్ ఆదివారం ఆరుగురు మిత్రులతో కలిసి తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో వరదయ్యపాలెం గ్రామ సమీపంలో ఉన్న తాడా జలపాతం వద్దకు వెళ్లారు. జలపాతంలో ప్రమాదవశాత్తు జారిపడిన నరేష్‌ను మిత్రులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సోమవారం తిరుపతిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సి.బెళగల్‌కు తీసుకవచ్చారు. చేతికి అందివచ్చిన కుమారుడి అకాల మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.
ఓర్వకల్లు: శృంగేరి జగద్గురువులు విద్యాశంకర భార తీ మహాస్వాముల వారు ఖమ్మం నుంచి బయలు దేరి సోమవారం సాయంత్రం ఓర్వకల్లుకు చేరుకున్నారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా ముందుగా స్వాముల వారు స్థానిక జీవేశ్వరస్వామి దేవస్థానానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక బాలభారతి వద్ద భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేసిన ప్రాంతానికి చేరుకున్నారు. వేదపండితులు ఫనిశశాంక శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో స్వాముల వారికి పొదుపు మహిళలు, రాజకీయ నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. రెండు రోజుల పాటు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మొదటి రోజున పాదపూజ, ఆశీర్వచనం, ధార్మిక ప్రవచనాలు, భక్తులతో సమావేశం, ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తీర్థప్రసాదాల వితరణ నిర్వహించారు. స్వాముల వారి విజయ యాత్ర సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మండల సమైఖ్య గౌరవ సలహాదారులు విజయభారతి, జెడ్పీటీసీ సభ్యుడు రంగనాథ్‌గౌడ్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కర్నూలు: కర్నూలు గణేష్ నగర్ ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో తాళం వేసిన ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రవేశిస్తున్నట్లు మహిళ రాజేశ్వరి ఇచ్చిన సమాచారంతో గస్తీ పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బుధవారపేటకు చెందిన షేక్ ఖాజా, షేక్ ఆలం హుసేన్‌గా గుర్తించి వారిని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. సమయ స్ఫూర్తితో పోలీసులకు సమాచారం అందించిన మహిళ రాజేశ్వరిని, వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేసిన హెడ్ కానిస్టేబుల్ ధన్‌రాజ్‌ను పోలీసు అధికారులు అభినందించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు కనిపిస్తే 112 లేదా 100కు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


