హమ్మయ్య.. నీటి రాక మొదలైంది | - | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. నీటి రాక మొదలైంది

Jul 7 2026 1:19 AM | Updated on Jul 7 2026 1:19 AM

● టీబీ డ్యాంకు చేరుతున్న వరద ● 10 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

● టీబీ డ్యాంకు చేరుతున్న వరద ● 10 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

హొళగుంద: ఇన్నాళ్లు ప్రవాహం లేక వెలవెలబోయిన కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి ఎట్టకేలకు సోమవారం ఇన్‌ఫ్లో నమోదు కావడంతో రైతుల మోములో ఆశలు చిగురిస్తున్నాయి. గతేడాది ఇదేరోజున డ్యాంలో 78 టీఎసీంల నీరుండగా ప్రస్తుతం 10 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటిన తర్వాత సోమవారం ఇన్‌ఫ్లో ప్రారంభం కావడంతో రైతులు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. శివమొగ్గ జిల్లాలో వర్షాలు కురిసినా తుంగభద్ర జలాశయం ఎగువన ఉన్న గాజనూరు జలాశయం (తుంగ ప్రాజెక్ట్‌) నిండేంత వరకు దిగువకు నీరు పారలేదు. ప్రాజెక్టులో నీటి నిల్వ గరిష్ఠ మట్టానికి చేరడంతో అక్కడి ఇంజినీర్లు 22 క్రస్ట్‌ గేట్లలో దాదాపు 15కు పైగా గేట్లను ఎత్తి 22 వేల క్యూసెక్కుల నీటిని నదికి వదులుతున్నారు. ఆ నీరు దిగువన హోస్పేట్‌ వద్ద నిర్మించిన తుంగభద్ర డ్యాం వైపు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఇన్‌ఫ్లో జీరో ఉండగా సోమవారం ఉదయం 2 వేల క్యూసెక్కులకు పైగా నమోదైంది. మంగళవారం ఉదయం నాటికి 10 నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు డ్యాంకు చేరే అవకాశాలున్నట్లు బోర్డు అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement