నంద్యాల(వ్యవసాయం)/పాణ్యం: రాజకీయ చైతన్యంతోనే బలిజ సమాజం అన్ని విధాలుగా అభ్యున్నతి చెందుతుందని గ్రేటర్ రాయలసీమ మహాబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, శాంతిరాం మెడికల్ కాలేజ్ అధినేత డాక్టర్ మిద్దె శాంతి రాముడు పేర్కొన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాలలోని శాంతిరాం మెడికల్ కాలేజీలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రేటర్ రాయలసీమ పరిధిలోని జిల్లాల నుంచి బలిజ నాయకులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, యువ నాయకులు, మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బలిజ సమాజం ప్రస్తుతం రాజకీయంగా ఎదుర్కొంటున్న సవాళ్లు, ఐక్యత, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, యువత పాత్ర, మహిళల భాగస్వామ్యం, విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, సామాజిక సాధికారత వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ ఒకప్పుడు బలిజలకు రాజకీయంగా చాలా ప్రాధాన్యం ఉండేదని, తిరిగి ఆ గుర్తింపు, గౌరవం సాధించుకోవాలన్నారు. అనంతరం గ్రేటర్ రాయలసీమ మహాబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ ఎం. శాంతిరాముడును వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో బలిజ మహా సంకల్పం అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర్లు, నాయకులు డాక్టర్ సోమశేఖర్, పరమేశ్వర రాజశేఖర్, పడకండ్ల సుబ్రహ్మణ్యం, ఆర్జా రామకృష్ణ, గాజుల విజయభాస్కర్, సమతం రాము, అడ్వకేట్ శివప్రసాద్, జనార్దన్ పాల్గొన్నారు.


