● యువకుడు ఆత్మహత్య
పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్‌లో భార్య కాపురానికి రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నరేంద్ర, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. నెహ్రూనగర్ ఎల్లంబావి సత్రంలో నివసిస్తున్న రామచంద్రుడు కుమారుడైన బోయ మండ్ల స్వాములు అలియాస్ స్వామి అనే వ్యక్తి తెలంగాణలోని క్రిష్ణదొడ్డి గ్రామానికి చెందిన మద్దమ్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వాములు మద్యానికి బానిసై వేధిస్తుండటంతో ఆరునెలల క్రితం మద్దమ్మ లొద్దిపల్లెలో ఉన్న అక్క వద్దకు వెళ్లింది. తిరిగి రావాలని పలుమార్లు ప్రాధేయపడినా రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన స్వాములు శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి పగిడ్యాల– ముచ్చుమర్రి గ్రామాల మధ్య ఎల్లం బొట్లమ్మ గుడి వద్ద చెట్టుకు పంచతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పగిడ్యాల గ్రామ కావలి మనుషులు ఆదివారం మధ్యాహ్నం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముచ్చుమర్రి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందకు దించి కుటుంబసభ్యులకు తెలియజేశారు. మృతుడి తండ్రి రామచంద్రుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.


