● అధికారులపై మండిపడిన గ్రామస్తులు
డోన్ (ప్యాపిలి): గార్లదిన్నె పంచాయతీ పరిధిలోని మాధవరం గ్రామంలో ఏపీఐఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కంకర పరిశ్రమను గ్రామస్తులు అడ్డుకున్నారు. శుక్రవారం మండల స్పెషల్ ఆఫీసర్ రాజేష్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ప్రజలు అధికారుల తీరుపై మండిపడ్డారు. గ్రామ సభ ప్రారంభం కాగానే ప్రశ్నల వర్షం కురిపించారు. సర్వే నంబర్ 691, 692 పరిధిలో 4.90 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రామసభ అనుమతి లేకుండా ఎవరూ కేటాయించారన్నారు. పర్యావరణ అనుమతి ఉందా? యువతకు ఉపాధిపై లిఖిత పూర్వక హామీలు ఎమైనా ఇచ్చారా? పరిశ్రమ పేరు, ఉత్పత్తి వివరాలు గ్రామస్తులకు తెలపకుండా ఎలా అనుమతులు ఇచ్చారన్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ అనుమతులతో పాటు అన్ని చట్లబద్ధమైన అనుమతులు పొందిన తరువాతే పరిశ్రమ ఏర్పాటు చేయాలని అంత వరకు అనుమతి ఇవ్వొద్దని అధికారులను కోరారు. దీంతో అధికారులు గ్రామ సభను వాయిదా వేసి వెనుదిరిగారు.


