మైనింగ్‌ అధికారుల దాడులు | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ అధికారుల దాడులు

Jul 4 2026 2:37 AM | Updated on Jul 4 2026 2:37 AM

కొలిమిగుండ్ల: బెలుం శింగవరంలో శుక్రవారం మైనింగ్‌ శాఖ అధికారులు దాడులు చేశారు. గ్రామ సమీపంలోని గాలేరు నగరి వరద కాల్వ వద్ద అక్రమ మైనింగ్‌ చేస్తున్నారనే నెపంతో తనిఖీలు చేశారు. గనుల్లో పనులు చేసేందుకు వచ్చిన ప్రొక్లెయినర్‌, మూడు టిప్పర్లను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అధికారులు ముందుగానే ఎంపిక చేసుకున్న యజమానుల గనుల్లో మాత్రమే దాడులకు దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమీపంలో ఇతరులకు చెందిన గనులకు జోలికి వెళ్లడం లేదనే విమర్శలు ఉన్నాయి. గనుల్లో పనులకు వెళ్లిన వాహనాలను ఎలాంటి సంబంధం లేక పోయినా స్టేషన్‌కు తరలించడంతో వాహనాల యజమానులు ఆందోళన చెందుతున్నారు.

బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలి

జిల్లా ఎస్పీ సునీల్‌ షోరాణ్‌

మహానంది: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి తక్షణమే స్పందించి చట్టపరిధిలో న్యాయం చేయాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్‌ షోరాణ్‌ ఆదేశించారు. మహానంది పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం సందర్శించారు. జిల్లా అడిషనల్‌ ఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్‌, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డిలతో కలిసి స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, తగిన న్యాయం అందేలా చూడాలని సూచించారు. వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.

ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలులోని ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్‌)లో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌) కోర్సును ఉచితంగా అభ్యసించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేంద్రం ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వైజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 17 సంవత్సరాలు దాటి ఇంటర్‌మీడియట్‌ ఉత్తీర్ణత, వొకేషనల్‌, వన్‌ సిట్టింగ్‌ ఉత్తీర్ణత పొందిన వారు కూడా అర్హులన్నారు. దరఖాస్తులు ప్రభుత్వ వెబ్‌సైట్‌ http://cfw.ap.nic.in నుంచి లేదా ప్రభుత్వ ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌) ట్రైనింగ్‌ స్కూల్‌, ప్రాంతీయ శిక్షణా కేంద్రం(సీ్త్రలు), కర్నూ లు వారి నుంచి పొంది, పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా అక్కడే సమర్పించాలన్నారు. ఉచిత హాస్టల్‌ వసతితో పాటు నెలవారీ స్టైఫండ్‌ ఇస్తారన్నారు. వివరాలకు 85559 10104, 90593 27020, 99899 81266 సంప్రదించాలని పేర్కొన్నారు.

శ్రీశైల దేవస్థానానికి రూ.11లక్షల విరాళం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం గుంటూరుకు చెందిన పీవీ రమణమ్మ రూ.5 లక్షలు, గో సంరక్షణ నిధి పథకానికి మరో రూ.5 లక్షలు మొత్తం రూ.10 లక్షల విరాళాన్ని దేవస్థాన పర్యవేక్షకులు కె.శివ ప్రసాద్‌కు అందజేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన కె.శంకర్‌ రూ.లక్ష విరాళాన్ని అందించారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం తరఫున స్వామి వారి శేష వస్త్రాన్ని, లడ్డూ ప్రసాదాలను, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.

నేడు జీపీడీపీపై ఎంపీడీఓలకు శిక్షణ

కర్నూలు(అర్బన్‌): గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ అధివృద్ధి అధికారులు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు ఈ నెల 4న శిక్షణను ఇస్తున్నట్లు డీపీఆర్‌సీ ప్రిన్సిపాల్‌, జెడ్పీ ఇన్‌చార్జి సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి శుక్రవారం తెలిపారు. శిక్షణ స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో నిర్వహిస్తామన్నారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు, ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌ తప్పక హాజరు కావాలన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న శిక్షణ అనంతరం మండల స్థాయిల్లో ఈ నెల 7న ఇదే అంశంపై శిక్షణ నిర్వహిస్తారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement