కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. 20 రోజులకు పైగా వర్షాల జాడ లేకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 1.60 లక్షలకుపైగా హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఇందులో ఇప్పటికే దాదాపు 50వేల హెక్టార్లలోని పంటల్లో ఎదుగుదల లోపించింది. మరో 25వేల హెక్టార్లలో అంతంతమాత్రం తేమలో విత్తనాలు విత్తుకోవడంతో మొలకలు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా ఆకాశం మేఘావృతం అవుతున్నా చినుకుజాడ లేకుండా పోయింది. రానున్న రోజుల్లో కూడా వర్షాలు జల్లులకే పరిమితం కానున్నాయి. దీంతో ఖరీఫ్ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లాలో పశ్చిమం దిశగా గాలులు గంటకు 15 కిలో మీటర్ల వేగంతో వీస్తుండటం గమనార్హం. ఇదిలాఉంటే గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉద యం వరకు ఎమ్మిగనూరులో 3.4 మి.మీ, కర్నూలు రూరల్‌లో 3.2, మంత్రాలయంలో 3, కర్నూలు అర్బన్‌లో 2.6, కల్లూరులో 1.2, కౌతాళంలో 0.6 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. ఆరు మండలాల్లో కలిపి నమోదైన వర్షపాతం 14 మి.మీ మాత్రమే.
7న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 7న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు జెడ్పీ ఇన్‌చార్జి సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి తెలిపారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య మరియు వైద్యం, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, పనులు–ఆర్థిక ప్రణాళిక శాఖలపై సమీక్ష కొనసాగుతుందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశాలకు స్థాయీ సంఘాల సభ్యులు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తమకు కేటాయించిన సమయానికి హాజరు కావాలని కోరారు.
ఇద్దరు ఎంపీడీఓలకు పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఇద్దరు ఎంపీడీఓలకు డివిజినల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు (డీడీఓ) గా పదో న్నతి లభించింది. ఈ మేరకు శుక్రవారం పీఆర్‌అండ్‌ఆర్‌డీ ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ ఆమోదించి విడుదల చేసిన జాబితాలో కల్లూరు ఎంపీడీఓ జి.నాగశేషాచలరెడ్డి, డీపీఆర్‌సీ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్న మంజులావాణి పేర్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది ఎంపీడీఓలకు డీడీఓలుగా పదోన్నతి లభించనుంది. ఈ మేరకు పీఆర్‌అండ్‌ఆర్‌డీ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్‌దండే జీఓ విడుదల చేశారు.


