బడిలో ఒకరు.. హాజరులో 13 | - | Sakshi
Sakshi News home page

బడిలో ఒకరు.. హాజరులో 13

Jul 4 2026 2:37 AM | Updated on Jul 4 2026 2:37 AM

పులిమద్ది ఫౌండేషన్‌ స్కూల్‌లో

విద్యార్థుల బోగస్‌ హాజరు

నంద్యాల(అర్బన్‌): స్థానిక పులిమద్ది గ్రామం ఎంపీపీఎస్‌ ఫౌండేషన్‌ స్కూల్‌లో విద్యార్థుల బోగస్‌ హాజరు వెలుగు చూసింది. ఒకే ఒక్క విద్యార్థిని పాఠశాలలో విద్యను అభ్యసిస్తుండగా 13 మంది విద్యార్థులు ఉన్నట్లు హాజరు పట్టికలో చూపుతూ హెచ్‌ఎం అవకతవకలకు పాల్పడుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఎంఈఓ బ్రహ్మంనాయక్‌ పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. రికార్డుల్లో 13 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించి తప్పుడు సమాచారం ఇచ్చిన హెచ్‌ఎం కృష్ణారావుపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా అధికారులకు నివేదిక పంపారు. బోగస్‌ హాజరు చూపుతూ వారికి వస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిధులు, గుడ్లు తదితరాలు స్వాహా చేసినట్లు వెలుగు చూసింది. అయితే గత నెలలో పాఠశాలలు పునః ప్రారంభమైన నాటి నుంచి ఈ తతంగం జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎవరూ ఆ పాఠశాల వైపు కన్నెత్తి చూడలేదు. గత ఏడాది సైతం ఇదే తరహాలో విద్యార్థుల హాజరు శాతం పూర్తిగా తగ్గిపోవడంతో పాఠశాలను డీ గ్రేడ్‌లో ఉంచారు. 2023–24లో దాదాపు 32 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో 2026 నాటికి ఒకే ఒక్క విద్యార్థితో స్కూల్‌ నడుస్తూ వస్తోంది. సమీపంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం నుంచి నలుగురు విద్యార్థులు పాఠశాలలో చేరిన కొద్ది రోజులకే ప్రైవేటు పాఠశాలకు వెళ్లడంతో ఒకే విద్యార్థిని నిహారిక విద్య అభ్యసిస్తోంది. విద్యార్థుల సంఖ్య తగ్గడం, ప్రభుత్వ బడి నిర్వీర్యం అవుతుండటంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement