బనగానపల్లె: నందవరం గ్రామంలో ఆర్టీసీ బస్సును నిలుపలేదని అదే గ్రామానికి చెందిన ప్రయాణికుడు శేషుకృష్ణ ఆందోళనకు దిగాడు. నందివర్గం ఎస్‌ఐ భూపాలుడు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని బస్సు స్టేజీ వద్ద గురువారం ప్రయాణికులు బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ ముందుకు కదిలించాడు. బస్సును ఆపాలంటూ ప్రయాణికుడు శేషుకృష్ణ అడిగినా నిలుపలేదు. అతను బస్సును వెంబడించి ఎక్కి డ్రైవర్ బాలయ్యతో వాగ్వాదానికి దిగాడు. దీంతో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బస్సు దిగిన శేషుకృష్ణ బస్సు ముందుకు వెళ్లకుండా అడ్డుగా పడుకున్నాడు. దాదాపు అర గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న నందివర్గం పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువురికి నచ్చజెప్పి శాంతింపజేశారు. ఇరువురు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పాముకాటుతో విద్యార్థి మృతి
కొత్తపల్లి: ఎర్రమఠం గ్రామ పంచాయతీ మజారా గ్రామమైన పాత మాడుగులలో ఓ విద్యార్థి పాముకాటుతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన రామచంద్రుడు, శివపార్వతి దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రామ్‌చరణ్ (13) ముసలిమడుగు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం అతని పెద్దనాన్న కుమార్తె పెళ్లి ముహూ ర్తం కావడంతో ఇంటివద్ద ఉన్నాడు. మధ్యాహ్నం ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా ఇంట్లో పొదిగిన కోడి గట్టిగా అరవడం గమనించాడు. మంచంపై నుంచే కోడిని నివారించేందుకు చేయి ఊపాడు. అప్పటికే అక్కడ ఉన్న పాము రామ్‌చరణ్ బొటన వేలుపై కాటువేసింది. కుటుంబీకులు వెంటనే ఎర్రమఠం వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. రామ్‌చరణ్ మృతితో పెళ్లింట విషాదం అలుముకుంది. కుటుంబీకులు, బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది.
ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు ఏఓలుగా పదోన్నతి
కర్నూలు(అర్బన్): కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం పరిధిలో ఇద్దరు సీనియర్ సహాయకులకు పరిపాలన అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ ఇన్‌చార్జి సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సి.బెళగల్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న డి.జయప్రకాష్‌ను దొర్నిపాడుకు, వెల్దుర్తిలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఎండీ ఉమైర్ అహ్మద్‌ను నంద్యాల ఎస్‌జీఎస్‌డబ్ల్యూ కార్యాలయానికి పదోన్నతి కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదోన్నతి ఉత్తర్వులను జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అందజేశారు.
హొళగుంద: సబ్సిడీ వేరుశనగ, యూరియా వస్తోందని, ముందుగా డబ్బులు చెల్లించిన వారికే ఇస్తామని చెప్పి వీఏఏ పరమేశ్ నాయక్ మోసం చేశారని నెరణికి గ్రామానికి చెందిన రైతులు గురువారం ఏఓ ఆనంద్ లోకాదళ్‌కు ఫిర్యాదు చేశారు. దాదాపు 50 మంది నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసి అదృశ్యమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయాడని నెరణికి చెందిన రైతులు సదాశివ, లింగప్ప, మల్లికార్జున, మాలింగ్‌సాబ్, మలకన్న, శేక్‌సాబ్ తదితరులు తెలిపారు. విత్తనాలు, ఎరువులు అందక, డబ్బులు కూడా తిరిగి రాక ఏమి చేయాలో తోచడం లేదన్నారు. వీఏఏపై చర్యలు తీసుకుని తమకు డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు. ఇదిలా ఉండగా నెరణికి రైతులతో పాటు నెరణికి తండా, కొత్తపేట రైతులు కూడా వీఏఏపై ఆలూరు సీఐకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.


