పుసులూరులో భారీ ఇసుక డంప్‌లు | - | Sakshi
Sakshi News home page

పుసులూరులో భారీ ఇసుక డంప్‌లు

Jul 3 2026 1:46 AM | Updated on Jul 3 2026 1:46 AM

విషయం తెలిసి నోటీసులతో

సరిపెట్టిన అధికారులు

నంద్యాల(అర్బన్‌): కుందూ నది పక్కనే ఉన్న పుసులూరులో కూటమి నాయకులు భారీగా ఇసుక డంప్‌ చేశారు. పది.. ఇరవై.. కాదు వందల సంఖ్యలో ట్రిప్పుల ఇసుకను కుందూ నది నుంచి తోడేసి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లా కేంద్రానికి 15 కి.మీ దూరంలో ఇసుక దందా దర్జాగా సాగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఓ సిమెంట్‌ ఫ్యాక్టరీకి మొరసు ఇసుకను తరలించేందుకు అంతా సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక్కో టిప్పర్‌ ఇసుక రూ.9 వేల ప్రకారం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. భారీ ఇసుక డంప్‌ల సమాచారం రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌, కేసీ కెనాల్‌ శాఖల అధికారులకు తెలిసినా చర్యలకు వెనుకాడుతున్నారు. పుసులూరు గ్రామంలోనే రెండు మూడు ప్రాంతాల్లో వేలాది ట్రాక్టర్‌ ట్రిప్పుల ఇసుక డంప్‌ చేసినా అడిగేవారు లేరు. అలాగే చాపిరేవుల గ్రామంలో ఇసుక డంప్‌ చేసి రాత్రి వేళ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పుసులూరు గ్రామంలో ఇసుక డంప్‌లపై నంద్యాల రూరల్‌ తహసీల్దార్‌ను వివరణ కోరగా.. ఇసుక డంప్‌ చేసిన వారికి నోటీసులు పంపామని, ఇంత వరకు సమాధానం ఏదీ రాలేదన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న సమయంలో అడ్డుకునేందుకు రెవెన్యూ శాఖ ప్రయత్నించిందని, అన్ని శాఖల సమన్వయంతో ఇసుక తరలింపును ఆపగలిగామన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement