చాలా సంవత్సరాలుగా మా గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో పొలం కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటాం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కౌలు కార్డు ఇవ్వడంతో ఐదేళ్లు వరుసగా రైతు భరోసా వచ్చింది. రెండు సార్లు ఇన్‌ఫుట్ సబ్సిడీ, పంటల బీమా కూడా రావడంతో ఆర్థికంగా నిలబడగలిగాం. ఈ ఏడాది ఎకరా రూ. 60 వేల చొప్పున 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. మూడు నెలల నుంచి కౌలు కార్డు కోసం తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
– చంద్ర, క్రిష్టిపాడు,
ఎస్సీ కాలనీ (దొర్నిపాడు మండలం)
ఈ ఏడాది 6 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి, బొప్పాయి, మల్లె తోటలు సాగు చేస్తున్నా. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏప్రిల్, మే నెలలోనే కౌలు కార్డులు ఇచ్చి ఉంటే బ్యాంకులో రుణాలు, ఎరువులు తీసుకునే వాళ్లం. ఈ ఏడాది జూలై వచ్చినా కార్డులు ఇవ్వలేదు. ఇప్పటికే ఎరువులు, విత్తనాలు అన్నీ ఇవ్వడం జరిగింది. ఇదిగో.. అదిగో అంటున్నారు. ఇప్పుడు ఇచ్చినా ఏం ఉపయోగం. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పు చేయాల్సి వస్తోంది.
– గేట్ల మాబుసాహెబ్, చాగలమర్రి
సీసీఆర్ కార్డుల పంపిణీ కోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం వెయ్యి కార్డులు జారీ చేసేందుకు పొలం యజమానులతో అగ్రిమెంట్ చేయించడం జరుగుతోంది. వాతావరణం అనూకూలంగా లేకపోవడం, వరి సాగు చేస్తే కాలువల్లో నీరు వస్తుందో రాదో అన్న సందిగ్ధంలో ఉన్నారు. దీంతో కౌలుకు తీసుకునేందుకు రైతులు వెనుకంజ వేయడంతో సంఖ్య తగ్గింది. కార్డుల జారీ లక్ష్యం పూర్తి చేస్తాం.
– వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి


