ఇద్దరు విద్యార్థులపై పిచ్చికుక్క దాడి | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు విద్యార్థులపై పిచ్చికుక్క దాడి

Jul 3 2026 1:46 AM | Updated on Jul 3 2026 1:46 AM

గోనెగండ్ల: స్థానిక సంతమార్కెట్‌లో గురువారం ఇద్దరు విద్యార్థులపై పిచ్చికుక్క దాడి చేసింది. తొలుత సోహెల్‌ను వీపు కింద భాగంలో కరిచింది. అనంతరం పాఠశాల నుంచి బయటకు వచ్చిన అన్సర్‌ అనే విద్యార్థిపై దాడి చేయడంతో ఎడమ చేతికి తీవ్రంగా గాయం అయ్యింది. గమనించిన స్థానికులు కుక్క దాడిలో గాయపడిన విద్యార్థులను సమీపంలోని మెడికల్‌ షాపు దగ్గర ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పంచాయతీ అధికారులు స్పందించి గ్రామాల్లో ఇళ్ల మధ్య గుంపు గుంపులుగా తిరిగే కుక్కలను బంధించి అడవుల్లో వదిలివేయాలని ప్రజలు కోరుతున్నారు.

ట్రాక్టర్‌ ఇంజిన్‌కు నిప్పు

బేతంచెర్ల: పట్టణంలోని దుర్గాపేట సమీపాన బలపాలపల్లె రహదారిలో ట్రాక్టర్‌ ఇంజిన్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టి దగ్ధం చేశారు. దుర్గాపేట కాలనీకి చెందిన ఉయ్యాలవాడ మద్దయ్య తన ట్రాక్టర్‌ను డోన్‌ రహదారిలోని నయారా పెట్రోలు బంక్‌ వద్ద బుధవారం రాత్రి ఉంచాడు. గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్‌ను అక్కడ నుంచి తీసుకెళ్లి బలపాలపల్లె రహదారి పక్కన ఉంచి ఇంజిన్‌పై డీజల్‌ పోసి అంటించడంతో ముందు టైర్లతో పాటు ఇంజిన్‌ దెబ్బతింది. ఈ ఘటనలో రూ. 4 నుంచి 5 లక్షల దాకా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు మద్దయ్య వాపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

మంత్రాలయం రూరల్‌: అనుమతి లేకుండా మంత్రాలయంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను గురువారం సీజ్‌ చేసినట్లు మైనింగ్‌ టెక్నికల్‌ అధికారి హాసీనాభాను తెలిపారు. ఇసుకను విచ్చలవిడిగా తోలడంతో భూగర్భ జలాలు ఇంకిపోతాయన్నారు. ఇసుక ట్రాక్టర్లతో మంత్రాలయం వచ్చే భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. సీజ్‌ చేసిన రెండు ట్రాక్టర్లను పోలీసుస్టేషన్‌ తరలించామన్నారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఇద్దరికి జైలు శిక్ష

డోన్‌ టౌన్‌: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఇద్దరు మందు బాబులకు జైలు శిక్షపడింది. సీఐ ఇంతియాజ్‌బాషా తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కొండపేటకు చెందిన కె.మల్లేష్‌, బి మహేష్‌ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా గురువారం జడ్జి ఎస్‌.నూరుల్లా విచారణ చేసి మల్లేష్‌కు మూడు రోజులు జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా, మహేష్‌కు మూడు రోజులు రిమాండ్‌కు ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అందరూ సహకరించాలన్నారు.

బాలికను రక్షించబోయి..

డోన్‌ టౌన్‌: తాడిపత్రి నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డోన్‌ వద్ద ప్రమాదానికి గురైంది. గురువారం మధ్యాహ్నం డోన్‌ ఆర్టీసీ బస్టాండ్‌ చేరుకున్న బస్సు అనంతరం కర్నూలుకు బయలుదేరింది. ప్రభుత్వ ఐటీఐ కళాశాల వద్ద వెళ్తుండగా ఒక అమ్మాయి అకస్మాత్తుగా రోడ్డుదాటేందుకు ప్రయత్నంచగా బస్సు డ్రైవర్‌ అప్రమత్తమై పక్కకు తిప్పడంతో కల్వర్టును ఢీకొని నిలిచిపోయింది. త్రుటిలో బాలిక ప్రాణాలతో బయటపడింది. బస్సు ఎడమ భాగం దెబ్బతినడంతో ప్రయాణికులను మరో బస్సులో కర్నూలుకు తరలించారు.

గాయపడిన విద్యార్థులు అన్సర్‌, సోహెల్‌కు టీకా వేస్తున్న వైద్య సిబ్బంది

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement