రహదారి భద్రత ప్రతిఒక్కరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

రహదారి భద్రత ప్రతిఒక్కరి బాధ్యత

Jul 3 2026 1:46 AM | Updated on Jul 3 2026 1:46 AM

ప్రభుత్వ పాఠశాలకు ఆటో విరాళం

కర్నూలు: రహదారి భద్రత ప్రతి ఒక్కరి కర్తవ్యమని రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ వే లిమిటెడ్‌ ప్రాజెక్ట్‌ హెడ్‌ వి.మదనమోహన్‌ అన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. జాతీయ రహదారులు రవాణాకు కీలక మార్గాలుగా ఉంటూనే మరోవైపు చిన్నపాటి అజాగ్రత్తల వల్ల ప్రమాద క్షేత్రాలుగా మారుతున్నాయని, వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తడిసిన రోడ్లు, అకస్మాత్తుగా తగ్గే విజిబులిటీ, వాహన సాంకేతిక లోపాల కారణంగా వర్షాకాలంలో ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉందన్నారు. వాహన టైర్లపై ఉండే స్పీడ్‌ రేటింగ్‌ అనే ఒక్క అక్షరం ప్రయాణించాల్సిన గరిష్ట సురక్షిత వేగాన్ని నిర్దేశిస్తుందన్నారు. ప్రమాదకరమైన రీతిలో ఓవర్‌ టేకింగ్‌ చేయడం, పరిమితికి మించిన వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం తగదన్నారు.

భక్తితో మొక్కలు నాటి..

బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైణ శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో పర్యావరణ పరిరక్షణకు ఓ భక్తుడు తనవంతు సేవగా మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచా డు. నంద్యాల పట్టణానికి చెందిన మెకానిక్‌ చాకలి సోమన్న కుటుంబ సభ్యులతో కలిసి గత ఏడాది నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 3 లక్షలు వెచ్చించి కాకినాడ నుంచి 140 మొక్కలను తెప్పించి నాటా రు. మర్రి, జువ్వి, మామిడి, రావి తదితర వృక్షాలను నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వయంగా చేపట్టారు. తరచూ ఆలయానికి వచ్చి మొక్కలను పరిశీలిస్తూ, అవసరమైన ఎరువులు వేయడం, నీరు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడు. పచ్చదనమే భవిష్యత్‌ తరాలకు అమూల్యమైన సంపద అని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటి సంరక్షించాలని సోమన్న పిలుపునిచ్చారు. ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంతో నింపేందుకు ఆయన చేస్తున్న సేవను భక్తులు, స్థానికులు అభినందిస్తూ, పర్యావరణ పరిరక్షణలో ఇలాంటి కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఉయ్యాలవాడ: కొండుపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు దాతలు ఆటోను విరాళంగా అందజేసినట్లు ఇన్‌చార్జ్‌ ప్రధానోపాధ్యాయుడు విప్రనారాయణాచారి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామానికి చెందిన మువ్వా చిన్నబాపిరెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ వారు రూ. 7 లక్షలు విలువ చేసే టాటా మ్యాక్స్‌ ప్యాసింజర్‌ ఆటోను అందజేశారు. ఈ ఆటో ద్వారా తమ పాఠశాలలో చదువుతున్న సర్వాయిపల్లె, ఆర్‌.పాంపల్లె గ్రామాలకు చెందిన 25 మంది విద్యార్థులను పాఠశాలకు తీసుకు వచ్చేందుకు దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా బాలిక విద్య ప్రోత్సాహం కోసం ఆటో ఉపయోగపడుతుందన్నారు. ఆటో నిర్వహణ బాధ్యత కొండుపల్లె గ్రామానికి చెందిన విద్యాభివృద్ధి కమిటీ చూసుకుంటుందని వెల్లడించారు. చిన్నబాపిరెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ వారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement