గుడ్డు సైజు తగ్గితే బ్లాక్‌ లిస్టులోకి కాంట్రాక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

గుడ్డు సైజు తగ్గితే బ్లాక్‌ లిస్టులోకి కాంట్రాక్టర్‌

Jul 3 2026 1:46 AM | Updated on Jul 3 2026 1:46 AM

హొళగుంద: ‘‘కోడిగుడ్ల సైజు మరీ చిన్నగా ఉంటోంది. 50 గ్రాములు పైగా ఉండాల్సిన బరువు 30–40 గ్రామాలు దాటడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లిస్టులో పెడతాం.’’ అని ఏపీ స్టేట్‌ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ్‌ ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన హొళగుంద మండలంలోని హెబ్బటం, హొళగుందలో పర్యటించారు. ఆయా గ్రామాల్లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లు, రేషన్‌షాపులతో పాటు హొళగుందలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) తనిఖీ చేశారు. కేజీబీవీ, ఉన్నత పాఠశాలలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లను పరిశీలించిన ఆయన సైజు చిన్నగా ఉండడాన్ని గమనించి సంబంధిత ఎస్‌ఓ, ఎంఈఓ–2 కబీర్‌సాబ్‌లను ప్రశ్నించారు. టెండర్‌దారుడి దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం మంచి గుడ్లను అందించేలా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌కు స్వయంగా ఫోన్‌ చేసి పెద్ద సైజు గుడ్లను పంపించాలని ఆదేశించారు. కేజీబీవీలో విద్యార్థినీలతో ముచ్చటిస్తూ వసతి కేంద్రంలో సమస్యలు, వంటలు ఇతరత్రాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫిర్యాదు బాక్స్‌లోని లెటర్లను పరిశీలించి చికెన్‌ను తక్కువ ఇస్తున్నారని, ఎక్కువ ఇవ్వాలని సూచించారు. అలాగే ఉప్మా వద్దన్న బాలికలకు ఎగ్‌ రైస్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక తహసీల్దారు లక్ష్మిరాజు తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement