వెల్దుర్తి: అధికారిక కార్యక్రమంలో వేదికపైకి పిలువకుండా దళితుడైన వెల్దుర్తి జెడ్పీటీసీ సభ్యుడు దాదిపోగు సుంకన్న మాదిగపై వివక్ష చూపారు. వీబీ–రామ్‌జీ పథకాన్ని జిల్లా స్థాయిలో ప్రారంభించి గురువారం వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వేదికపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు, అధికారులు ఉన్నారు. వారితో పాటు ముందు వరుసలో టీడీపీ నాయకులు బొమ్మిరెడ్డిపల్లె సుబ్బరాయుడు, ఎల్‌ఈ జ్ఞానేశ్వర్ గౌడ్, బొమ్మన రమాకాంత్ రెడ్డి, వెనుక వరుసలో రామకృష్ణ ఆచారి, వెంకటేశ్వరరెడ్డి, సుధాకర్, ఐజయ్య కనిపించారు. ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరు కావలన్న పిలుపుతో అక్కడికి వచ్చిన జెడ్పీటీసీ సభ్యుడు దాదిపోగు సుంకన్న మాదిగను కనీసం వేదికపైకి ఆహ్వానించలేదు. దీంతో ఆయన ప్రజలతో పాటు షామియానా కింద కుర్చీలో కూర్చున్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్న సందర్భంలో జెడ్పీటీసీ సభ్యునికి జరుగుతున్న అవమానంపై మీడియా చేస్తున్న హడావుడిని ఏపీఓ లక్ష్మన్న గుర్తించారు. వెంటనే జెడ్పీటీసీ సభ్యుడిని స్టేజ్‌పైకి పిలుచుకుని వెళ్లారు. దళిత ప్రజాప్రతినిధికి జరిగిన అవమానంపై ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు క్షమాపణలు చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


