కర్నూలు(హాస్పిటల్): దోమలు పుట్టకూడదని, ఒకవేళ పుట్టినా అవి కుట్టకుండా వైద్యసిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించాలని ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ చెప్పారు. జాతీయ డెంగీ మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆయన తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి నిల్వ ఎక్కడుంటే అక్కడ వివిధ రకాల దోమలు పెరుగుతాయని, వీటి ద్వారా డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటిలోపల, బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో మలేరియా నియంత్రణాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్ ఉమ, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ శైలేష్‌కుమార్, డాక్టర్ మహేశ్వరప్రసాద్, డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి, సహాయ మలేరియా అధికారి విజయ్‌కుమార్, డీపీఓ విజయరాజ్, డీపీహెచ్‌ఎన్‌ఓ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.


