ఎమ్మిగనూరుసెంట్రల్: మండలంలోని కోటేకల్లు గ్రామంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన సంఘటన కలకలం రేపింది. గ్రామంలోని కొండ మీద బసవేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఆలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి. కార్తీకమాసం, శ్రావణ మాసంలో స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి. అంతటి ప్రాధాన్యత కలిగిన దేవాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. మంగళవారం ఆలయానికి వెళ్లిన భక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలుగకుండా, పురావస్తు సంపదకు నష్టం జరుగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.


