● ఒకరికి గాయాలు
వెల్దుర్తి: జాతీయ రహదారి 44పై అల్లుగుండు పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. తమిళనాడుకు చెందిన డ్రైవర్ శక్తి తన లారీని రోడ్డు పక్కన నిలిపి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టినప్పటికీ, ముందు సీట్లలోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో డ్రైవర్, మరో యువకుడు ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడ్డారు. వెనుక సీట్లో కూర్చున్న హైదరాబాద్‌కు చెందిన వెంకటరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రమాదానికి గురైన కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.


