కొండపైకి చేరుకుంటున్న అశేష భక్తజనం
జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఊరూరా ఘనంగా నిర్వహించారు. రెండో రోజు మంగళవారం మండల కేంద్రం కోసిగి కొండపై వెలసిన శ్రీ తిమ్మప్ప (ఆంజనేయ)స్వామికి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు తండోప తండాలుగా కొండపైకి చేరుకుని స్వామికి నారికేళలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి కొండంత భక్తిని చాటారు. ఇటీవల కొత్తగా పెళ్లి చేసుకున్న స్వామి వారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. స్వామి దర్శనం అనంతరం కొండపై విహరిస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. కోసిగిలో కొండ దిగువ భాగాన ఆదోని రోడ్డులోని బాపులదొడ్డి క్రాస్ రోడ్డు నుంచి కోసిగి వరకు పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ మంజునాథ్, ఎస్‌ఐ రమేష్ రెడ్డిల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.
– కోసిగి


