నంద్యాల(అర్బన్): ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ (సర్–2026) జిల్లాలో క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళంగా మారింది. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ చేయడంలో చూపిన ఉత్సాహం... వాటిని ఆన్‌లైన్ పోర్టల్లో నమోదు (డిజిటలైజేషన్) చేయడంలో అధికారులు, సిబ్బంది పూర్తిగా విస్మరించారు. జిల్లాలో సోమవారం సాయంత్రం వరకు అందిన అధికారిక గణాంకాలే ఇందుకు నిదర్శనం. జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఫారాలు సేకరించి కార్యాలయాల్లో మూలనపడేసేశారు కానీ.. వాటి కంప్యూటరీకరణ ప్రక్రియ మాత్రం దారుణంగా వెనుకబడింది. దాదాపు 14 రోజుల క్రితం ప్రారంభమైన సర్ కార్యక్రమం కేవలం 24.47 శాతానికే పరిమితమైంది. ఇదే అలసత్వం కొనసాగితే రాబోయే ముసాయిదా జాబితా తప్పుల తడకగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,629 మంది బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌ఓలు) క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నా రు. మొత్తం 14,05,443 మంది ఓటర్లు ఉండగా.. అధికారులు ఇప్పటివరకు 13,80,388 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, రికార్డు స్థాయిలో 98.22 శాతం పూర్తి చేశారు. అయితే, సేకరించిన ఫారాలను కంప్యూటర్లలో నమోదు చేసే ప్రక్రియలో యంత్రాంగం చేతులెత్తేసింది. జిల్లా వ్యాప్తంగా 3,43,904 ఫారాలు మాత్రమే ఆన్‌లైన్ అయ్యాయి. అంటే దాదాపు 10.61 లక్షల మంది ఓటర్ల డేటా ఇంకా కార్యాలయాల్లోని ఫైళ్లలోనే మగ్గుతోంది.
జిల్లా కేంద్రంలో 19.39 శాతమే..
జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉండగా అందులో జిల్లా కేంద్రం నంద్యాలలో డిజిటలైజేషన్ అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ అత్యధికంగా 2,76,813 మంది ఓటర్లు ఉండగా 2,75,307 ఫారాలను పంపిణీ చేశారు. కానీ, డిజిటలైజేషన్ కేవలం 19.39 శాతంతో 53,677 ఫారాలు మాత్రమే పూర్తయ్యాయి. నందికొట్కూరు నియోజకవర్గంలో డిజిటలైజేషన్ ప్రక్రియ మరింత దారుణంగా ఉంది. అందులో 2,20,814 మంది ఓటర్లు ఉండగా 2,14,730 మందికి ఫారాలు పంపిణీ జరిగితే... ఆన్‌లైన్ నమోదు కేవలం 19.05 శాతం మాత్రమే కావడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
ముంచుకొస్తున్న గడువు..
ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలో టాప్ పొజిషన్‌లో ఉన్న ఆళ్లగడ్డ నియోజవర్గంలో కూడా కేలవలం 34.08 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తి కావడం గమనార్హం. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ముంచుకొస్తున్నా డేటా ఎంట్రీ ప్రక్రియ ఇంత మందకొడిగా సాగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూలై 14వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ, డిజిటలైజేషన్ పూర్తి చేయాల్సి ఉంది. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల చేయనున్నారు. సర్వేల పేరుతో సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సకాలంలో నమోదు చేయకపోకతే, అర్హులైన ఓటర్ల పేర్లు, ముసాయిదా జాబితా నుంచి గల్లంతయ్యే ప్రమాదం ఉందని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి కేవలం ఫారాల పంపిణీ టార్గెట్లకే పరిమితం కాకుండా. ప్రత్యేక సిబ్బందిని (డేటా ఎంట్రీ ఆపరేటర్లను) నియమించి యుద్ధప్రాతిపదికన డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అసవరం ఉంది. లేని పక్షంలో సామాన్య ఓటరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పరిశీలకుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సర్.. డిజిడల్
జిల్లాలో సర్ సర్వే పరిస్థితి ఇలా..


