శ్రీశైలంలో వైభవంగా గిరి ప్రదక్షిణ | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో వైభవంగా గిరి ప్రదక్షిణ

Jun 30 2026 2:59 AM | Updated on Jun 30 2026 2:59 AM

శ్రీశైలంలో వైభవంగా గిరి ప్రదక్షిణ

శ్రీశైలం టెంపుల్‌: పౌర్ణమి సందర్భంగా జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం గిరిప్రదక్షిణను నిర్వహించారు. క్షేత్రంలోని ప్రాచీన మఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయించి భక్తిభావాలను పెంపొందించారు. సోమవారం సాయంత్రం స్వామిఅమ్మవార్ల మహామంగళహారతులు ఇచ్చిన అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలై గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగాసదనం మీదుగా బయలువీరభద్రస్వామి ఆలయం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయరహదారి, సారంగధర మఠం మీదుగా హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి మహిషాసురమర్దిని, రుద్రాక్షమఠం, విభూతిమఠాల మీదుగా రుద్రవనం, నందిమండపం వద్దకు రావడంతో గిరి ప్రదక్షిణ ముగిసింది. దేవస్థాన అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

అహోబిలంలో పౌర్ణమి పూజలు

ఆళ్లగడ్డ: పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం అహోబిలంలో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆలయం ముఖద్వారం మండపంలో కొలువుంచారు. పంచామృతాలతో అభిషేకించి దూపదీపాలతో మహామంగళహారతి ఇచ్చారు. అనంతరం నైవేద్యం నివేదించారు. రాత్రి విశేషాలంకరణలో స్వామి ఉభయ దేవేరులతో కొలువుదీరి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.

పీజీఆర్‌ఎస్‌కు

105 ఫిర్యాదులు

బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి ప్రజల నుంచి 105 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ సునిల్‌షెరాన్‌ మాట్లాడుతూ.. ఫిర్యాదుల్లో చట్టపరిధిలో ఉన్న సమస్యలను వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించామన్నారు. కొన్ని సమస్యలను బాధితుల స్టేషన్‌ పరిధి అధికారులకు బదిలీ చేశామన్నారు. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని, ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించామన్నారు.

డీసీసీబీ సీఈఓగా బాలాజీరావు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఇవో)గా సీహెచ్‌ఆర్‌సీఎస్‌ బాలాజీరావు నియమితులయ్యారు. సీఈఓ పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. డీసీసీబీలో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న పి.రామాంజనేయులు ఇన్‌చార్జి సీఇవోగా పనిచేస్తున్నారు. రెగ్యులర్‌ సీఇవో నియమితులయ్యే వరకు ఇన్‌చార్జి సీఇవోను నియమించాలని ఆప్కాబ్‌ ఎండీకి డీసీసీబీ నుంచి లేఖ రాసినట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా ఆప్కాబ్‌లో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ అయిన బాలాజీరావును కర్నూలు డీసీసీబీకి ఇన్‌చార్జి సీఇవోగా నియమిస్తూ ఆప్కాబ్‌ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టారు. నూతన సీఇవోగా బాధ్యతలు చేపట్టిన బాలాజీరావును జనరల్‌ మేనేజర్లు పి.రామాంజనేయులు, శివలీల, డీపీడీఎం రంగనాథ్‌, డీజీఎంలు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్‌కుమార్‌, ఏజీఎంలు త్రినాథ్‌రెడ్డి, గీత, సరోజమ్మ, రాఘవేంద్ర తదితరులను అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement