వసతుల్లో వెనుక‘బడి’ | - | Sakshi
Sakshi News home page

వసతుల్లో వెనుక‘బడి’

Jun 30 2026 2:59 AM | Updated on Jun 30 2026 2:59 AM

కర్నూలు సిటీ: కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థ గాడి తప్పింది. దేశానికి ఏపీ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ను ఓ మోడల్‌గా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పిన విద్యాశాఖ మంత్రి చేతల్లో చూపించడంలో విఫలమయ్యారు. ఇందుకు గత నెలలో ఆ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో జిల్లాకు దక్కిన స్థానమే ఉదాహరణ. జిల్లాలో అన్ని యాజమాన్యాల బడులు 2,254 ఉండగా 4.57 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 1,445 ప్రభుత్వ యాజమాన్య స్కూల్స్‌ ఉండగా వాటిలో 2.49 లక్షల మంది పిల్లలు ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మన బడి నాడు–నేడు ద్వారా రెండు విడతలుగా పనులు జరిగాయి. మొదటి విడతలో 594 పాఠశాలల్లో రూ.166.25 కోట్లు ఖర్చు పెట్టి 9 రకాల మౌలిక సదుపాయాలు కల్పించే పనులు పూర్తి చేశారు. రెండో విడతలో 1051 స్కూళ్లలో రూ.504.16 కోట్లతో పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మౌలిక సదుపాయాల పనులను పూర్తిగా నిలిపి వేసింది. 1310 అదనపు తరగతి గదులు నిర్మించేందుకు పనులు మొదలు పెట్టగా వాటికి ఈ రెండేళ్లలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. అదే విధంగా 685 స్కూళ్లలో రన్నింగ్‌ వాటర్‌తో కూడిన టాయిలెట్ల ఫినిషింగ్‌, 701 స్కూళ్లలో విద్యుత్‌ సరఫరా పనులు, 714 స్కూళ్లలో తాగు నీటి కల్పన పనులు, 694 బడుల్లో మైనర్‌, మేజర్‌ పనులు, 380 స్కూళ్లలో కాంపౌండ్‌ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో మౌలిక సదుపాయాల్లో జిల్లా చిట్టచివరి (28జిల్లాల్లో 28వ స్థానం) స్థానంలో నిలిచింది. విద్యార్థుల ప్రవేశాల్లో 11, విద్యార్థులు, టీచర్‌ హాజరులో 22, నిపున్‌ భారత్‌ మిషన్‌ కింద కేంద్రం చేపట్టిన ఎఫ్‌ఎల్‌ఎన్‌లో 27, విద్యాశాఖ అధికారుల తనిఖీల్లో 22, డ్రాపౌట్స్‌లో 24వ స్థానంలో జిల్లా నిలిచింది. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఈ నెల 13వ తేదీన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తమీమ్‌ అన్సారీయా హైలెవెల్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి కలెక్టర్‌ చైర్మెన్‌గా, పాఠశాల విద్య అడిషనల్‌ డైరెక్టర్‌ వైస్‌ చైర్మెన్‌గా, పాఠశాల విద్య కడప ఆర్జేడీ, ఇద్దరు ఎంఈఓలు, ఇద్దరు గ్రేడ్‌ హెచ్‌ఎంలు, ఇద్దరు ఎన్జీఓలు సభ్యులుగా, డీఈఓ మెంబరు కన్వీనర్‌గా, కేపీఎంజీ అనే కన్సల్టెంట్‌ సభ్యులుగా ఉన్నారు. నేడు ఈ హైలెవల్‌ కమిటీ జిల్లాలో పర్యటించనుంది.

గాడి తప్పిన విద్యావ్యవస్థ

మౌలిక సదుపాయాల కల్పనలో

అట్టడుగున జిల్లా

నేడు జిల్లాలో పర్యటించనున్న

హైలెవెల్‌ కమిటీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement