శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులు దీరారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులు తీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీకి అనుగు ణంగా దేవస్థానం విస్త్రత ఏర్పాట్లు చేసింది. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆలయంలోని శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్ద దర్శనానికి వెళ్లే పలువురు ఐదేళ్ల లోపు చిన్నారులకు దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు పోలియో చుక్కలు వేశారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 29వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
బీసీ హాస్టళ్లలో ప్రవేశాలు పెంచాలి
కర్నూలు(అర్బన్): బీసీ హాస్టళ్లలో విద్యార్థుల ప్రవేశాలను పెంచాలని వసతి గృహ సంక్షేమాధికారులను జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే ప్రసూన ఆదేశించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 12న పాఠశాలలు పునః ప్రారంభమైనా నేటి వరకు జిల్లాలోని రెండు, మూడు వసతి గృహాలకు రెన్యువల్ విద్యార్థుల హాజరు జీరో ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారులు విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని పలు బీసీ వసతి గృహాల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థుల డిమాండ్ చాలా ఉందన్నారు. అయితే ఆయా వసతి గృహాలకు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు ఇబ్బందులు ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ అంశంపై రెండు, మూడు రోజుల్లో హెచ్‌డబ్ల్యూఓలతో సమావేశం నిర్వహించి సమస్యను జిల్లా కలెక్టర్ ద్వారా డీఈఓ దృష్టికి తీసుకుపోతామన్నారు.
నేడు డయల్ యువర్
సీఎండీ, ఎస్‌ఈ
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్‌కుమార్ ఆదివారం తెలిపారు. వినియోగదారులు 8977716661కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్‌లో సోమవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు 7382614308కు ఫోన్‌చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.


