● కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: రెండు పోలియో చుక్కలు చిన్నారుల బంగారు భవితకు ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఆదివారం మూలసాగరంలోని ఎంఎస్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భారతదేశం పోలియో రహిత దేశంగా ఉన్నప్పటికీ చుట్టుపక్కల దేశాల్లో అక్కడక్కడ పోలియో కేసులు నమోదవ్వడం వల్ల వాటి నుంచి పిల్లలను రక్షించడానికి ఏటా జూన్, డిసెంబర్ మాసాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. అందుకు 0–5 సంవత్సరాలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. జిల్లాలో 2.38 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 1,320 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా ప్రయాణాల్లో ఉన్న చిన్నారుల కోసం బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ దగ్గర కూడా పోలియో చుక్కల కేంద్రాలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా, బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత భారత్‌ను కాపాడుకోవడంలో భాగస్వాములు కావాలన్నారు. అత్వవసర పరిస్థితుల్లో పోలియో కేంద్రాలకు వెళ్లలేని వారి కోసం ఈ నెల 29, 30 తేదీల్లో మాప్–అప్ కార్యక్రమం ద్వారా మిగిలిపోయిన పిల్లలందరికీ పోలియో చుక్కలు వైద్య సిబ్బంది ద్వారా ఇంటింటికి వచ్చి పోలియో చుక్కలు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మెప్మా పీడీ వెంకట దాసు, జిల్లా పల్స్ పోలియో నోడల్ ఆఫీసర్ రమేష్, జిల్లా ఇమ్యూనెజేషన్ అధికారి సుదర్శన్ బాబు, ప్రోగ్రామ్ అధికారులు శారద బాయి, లక్ష్మీప్రసన్న, ఎన్టీఆర్ ట్రస్ట్ కోఆర్డినేటర్ రూపేంద్రనాథ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


