నంద్యాల: పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డ్‌లో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన గోదామును జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల వద్ద ఏర్పాటు చేసిన సీళ్లను తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతపై సమీక్షించారు. గోదాము పరిసరాలను శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈవీఎంల భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఆర్‌ఓ రామునాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ సత్య శ్రీనివాసులు, ఎలక్షన్ డీటీ మనోహర్ పాల్గొన్నారు.
లింక్‌తో ఎరువులు విక్రయించరాదు
● జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్
నంద్యాల: యూరియా, డీఏపీ ఎరువులతో ఎటువంటి లింక్ ప్రొడక్టులను జతచేసి విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఆదేశించారు. తన కార్యాలయంలోని వీసీ హాల్‌లో జిల్లాలోని ఎరువుల తయారీ సంస్థల అధికారులు, హ్యాండ్లింగ్ ఆపరేటర్లతో జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేక్ పాయింట్ నుంచి ఎరువుల డీలర్లకు సరఫరా చేసే సమయంలో తప్పనిసరిగా జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఎమ్మార్పీ ప్రకారమే డీలర్లు ఎరువులను విక్రయించాలన్నారు. రైతులకు అవసరమైన మేరకు పారదర్శకంగా, సమర్థవంతంగా ఎరువుల సరఫరా చేయాలన్నార. జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. ఎరువులను అవసరమైన ప్రాంతాలకు మాత్రమే డీలర్లు సరఫరా చేయాలన్నారు. సమావేశంలో నంద్యాల వ్యవసాయ అధికారి ప్రసాదరావు, మార్క్‌ఫెడ్ అధికారి హరినాథ్ రెడ్డి, సాంకేతిక వ్యవసాయ అధికారి కల్యాణ్ కుమార్, ఏఈఓ కవిత పాల్గొన్నారు.
దేవస్థాన చిరుద్యోగిపై
‘ఇంటెలిజెన్స్’ ఆరా
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో తన హవా కొనసాగిస్తున్న చిరుద్యోగిపై ఇంటెలిజెన్స్ అంతర్గతంగా పూర్తిస్థాయిలో విచారించినట్లు తెలుస్తోంది. ‘సాక్షి’ దినపత్రికలో శనివారం ‘పలుకుబడే పెట్టుబడి..పరిచయాలే ఆదాయం’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అసలు ఆ చిరుద్యోగి విధులు ఎక్కడ, ఏమి విధులు నిర్వహిస్తున్నాడు.. శ్రీశైలంలోని కొత్తపేటలో ఇల్లు కట్టుకునేందుకు అనుమతులు ఎవరు ఇచ్చారు.. చిరుద్యోగి వెనక ఉన్న అధికారులు ఎవరు.. ఇతర విషయాలపై ఇంటలిజెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో విచారించినట్లు విశ్వసనీయ సమాచారం.
పీఓఎస్ పరికరాల బహూకరణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారు 50 పీఓఎస్ పరికరాలను బహూకరించారు. శనివారం దేవస్థాన పరిపాలన భవనంలో బ్యాంకు అధికారులు దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావును కలిసి వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. వీటితో భక్తులు ఆయా కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు.టోల్‌గేట్, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం, ప్రసాదాల కౌంటర్లలో వీటిని వినియోగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో తిరుపతి జోనల్ హెడ్, జనరల్ మేనేజర్ పత్రి శ్రీనివాసకుమార్, కర్నూలు రీజనల్ హెడ్, అసిస్టెంట్ మేనేజర్ డి.అనిల్‌కుమార్, శ్రీశైలం బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.


