మల్లన్న దేవస్థానంలో చిరుద్యోగి హవా..!
పేరుకే కాంట్రాక్ట్ ఉద్యోగి..అంతా హై రేంజ్
అటెండర్ విధులకు డుమ్మా.. దర్శనాల పేరుతో ప్రైవేట్ వ్యాపారం
దేవస్థాన ఉన్నతాధికారి ఆశీస్సులు ఉన్నాయంటూ అధికారులకు బెదిరింపులు
దేవస్థానానికి చెందిన రెండు సెంట్ల భూమి కబ్జా, భవనం నిర్మాణం
చోద్యం చూస్తున్న దేవస్థాన రెవెన్యూ విభాగం
ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం
శ్రీశైలంటెంపుల్: పరమేశ్వరుడి పేరు పెట్టుకున్న ఓ చిరు ఉద్యోగి శ్రీశైల దేవస్థానంలో అక్రమాలకు పాల్పడుతున్నా అడిగేవారు లేరు. అటెండర్ విధులు నిర్వహిస్తున్న ఓ చిరుద్యోగి పేరుకే కాంట్రాక్ట్ ఉద్యోగి కానీ అతనిది అంతా హై రేంజ్ అని స్థానికంగా చర్చించుకుంటున్నారు. తనకు ఉన్న పలుకుబడి, రాజకీయ పరిచయాలతో దేవస్థానానికి ఉన్నతాధికారిగా వచ్చిన అధికారిని ప్రసన్నం చేసుకుని తన పనులు చక్కబెట్టుకుంటున్నాడు. శ్రీశైల దేవస్థానంలో అటెండర్ స్థాయి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఓ చిరుద్యోగి ఎప్పుడు కూడా తన విధుల నిర్వర్తించకుండా బయట తిరుగుతుంటాడని సమాచారం. ముఖచిత్ర హాజరుకు మాత్రం వస్తాడని తెలుస్తోంది. మిగతా సమయాల్లో దేవస్థాన పరిపాలన కార్యాలయంలో, దర్శనాల కోసం ఆలయంలో తిరుగుతుంటాడని సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సదరు ఉద్యోగిని టోల్‌గేట్‌కు బదిలీ చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ ముఖ్య నాయకుడి సతీమణితో సిఫార్స్ చేయించుకోవడంతో కూటమి నేతలు కూడా కంగుతిన్నారు. తన బదిలీని నిలుపుదల చేసుకుని, తనకు నచ్చిన చోట, విధులకు హాజరుకాకపోయిన పట్టించుకోని ఓ విభాగంలో బదిలీ చేయాలని ఇతనే అధికారులకు చాయిస్ ఇవ్వడంతో అతనికి నచ్చిన విభాగానికి బదిలీ చేసినట్లు సమాచారం. తనకు పలుకుబడి ఉన్న ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు శ్రీశైలానికి వస్తే వారికి స్వామి అమ్మవార్ల దర్శనాలు చేయించే పనిలో నిమగ్నం అయి ప్రైవేట్ వ్యాపారం చేస్తాడని సమాచారం. అంతేకాకుండా రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంలో తనకు పలుకుబడి ఉందని ఎవరికై నా దర్శనం కావాలంటే తనని సంప్రదించాలని చెబుతుంటాడని సమాచారం. శ్రీశైల దేవస్థానంలో ఉన్నతాధికారి తనకు సన్నిహితంగా ఉంటాడని, ముఖ్య అధికారి ఆశీస్సులు తనకు పుష్కలంగాా ఉన్నాయని, తాను ఏది చెబితే అది జరుగుతుందని దేవస్థాన అధికారులను భయబ్రాంతులకు గురిచేస్తాడని తెలుస్తోంది.
భవనం అధికారులకు కనిపించదు..
దేవస్థాన కాంట్రాక్ట్ ఉద్యోగి దేవస్థాన స్థలాన్ని కబ్జా చేసి భవనం నిర్మిస్తుంటే అ వైపు కన్నెత్తి కూడా చూసే సాహసం చేయలేని పరిస్థితిలో దేవస్థాన రెవెన్యూ విభాగం ఉంది. అంటే సదరు ఉద్యోగి పవర్ ఎంత ఉందొ ఇట్లే అర్థమవుతుంది. సదరు చిరు ఉద్యోగికి ఉన్నతాధికారి ఆశీస్సులు కూడా ఉండడంతో ఆ ఉద్యోగి నిర్మాణం నిలుపుదల చేసేందుకు రెవెన్యూ విభాగ అధికారులు సాహసించలేక పోయారు. చిన్నపాటి వ్యక్తి ఏదైనా మరమ్మతులు చేసుకుంటే మాత్రం ముప్పతిప్పలు పెట్టే రెవెన్యూ విభాగ అధికారులు భారీ భవంతి నిర్మిస్తుంటే మాత్రం పట్టింకోకపోవడంపై ఆ మర్మం ఆ మల్లన్నకే ఎరుకా..!.
ఉన్నతాధికారి అభయం..రెండు సెంట్ల స్థలం కబ్జా
శ్రీశైలంలోని కొత్తపేట కాలనీలో సదరు చిరు ఉద్యోగి తన పలుకుబడిని ఉపయోగించి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ దేవస్థాన ఉన్నతాధికారి అభయంతో రెండు సెంట్ల స్థలాన్ని కబ్జా చేశాడు. కబ్జా చేయడంతో పాటు ఆ స్థలంలో విశాలవంతమైన భవంతిని సైతం నిర్మిస్తున్నాడు. దేవస్థాన ఉన్నతాధికారి నుంచి అనుమతులు ఉన్నాయంటూ అధికారులను బెదిరిస్తూ అధ్యాత్మిక క్షేత్రాన్ని కబ్జాల మయం చేశాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన నెలవారి వేతనం సుమారు రూ.20 వేలు ఉంటుంది. అయితే అతను మాత్రం సుమారు రూ.20 లక్షల పైబడి భవంతిని నిర్మిస్తుండడంపై స్థానికులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
శ్రీశైల దేవస్థానానికి చెందిన స్థలాన్ని ఎంతటి వారైన ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. దేవస్థానం స్థలంలో ఇంటి నిర్మాణాల కోసం ఎవరికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. తిరుమల తిరుపతి తరహాలోనే శ్రీశైల దేవ స్థానంలో కూడా వైదిక సిబ్బంది మాత్రమే స్థానికంగా ఉంటారు. మిగిలిన ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు సున్నిపెంటకు తరలివెళ్లాల్సిందే. క్షేత్ర పరిధిలో సుమారు 3,600 మందిని సున్నిపెంటకు తరలించే ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇందులో భాగంగానే ఇక్కడ ఎవరు ఎంతటి నిర్మాణం చేసిన కచ్చితంగా తొలగిస్తాం.
– శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన
కార్యనిర్వహణాధికారి


