పెద్దదోర్నాల: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని నల్లమల అభయారణ్యంలోని తుమ్మలబైలు గిరిజన గూడెం సమీపంలో అడవిదున్న స్థానికుల కంటపడింది. దీంతో కొందరు యాత్రికులు తమ సెల్‌ఫోన్లలో అడవిదున్న సంచరిస్తున్న దృశ్యాలను బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. 1870కు ముందు ఒక్కసారిగా మాయమైన అడవిదున్న 152 ఏళ్ల తరువాత 2022లో నల్లమల అభయారణ్యంలోని గుండ్ల బ్రహ్మేశ్వరం అడవుల్లో కనిపించడం అప్పట్లో చర్చనీయాంశఽమైంది. కొన్నేళ్ల తరువాత మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లోని పంట పొలాల్లో ప్రత్యక్షమైన అడవిదున్న.. కొన్ని రోజుల అనంతరం నల్లమల అభయారణ్యంలో స్థానికులకు తారసపడింది. ఇండియన్ గౌర్, ఇండియన్ బైసన్‌గా పిలుచుకునే అడవిదున్నలు నీలగిరి, మధ్యప్రదేశ్ అభయారణ్యాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. వీటిని నల్లమల అభయారణ్యాలకు తరలించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా, అడవిదున్న సంచారంపై ఫారెస్ట్ రేంజి అధికారి హరిని సంప్రదించగా కొద్ది రోజులుగా గుండ్ల బ్రహ్మేశ్వరం, మార్కాపురం ఏరియాలో సంచరించిన అడవిదున్నే తిరిగి నల్లమల అభయారణ్యంలోకి ప్రవేశించి ఉండవచ్చన్నారు.


