ఈ ఏడాది మూడు ఎకరాల సొంత పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాను. సేద్యాలు, విత్తనాలు, కూలీల ఖర్చు రూపంలో ఇప్పటికే రూ. 40 వేల దాక పెట్టుబడి వెచ్చించాను. వర్షాలు కురిస్తేనే పంట చేతికందుతోంది. గత ఏడాది మార్కెట్‌లో ధర లేకపోవడంతో క్వింటా రూ. 1700లకే అమ్ముకోవాల్సి రావడంతో నష్టపోయాను.
– బుజ్జి, పాలసాగరం, ఆళ్లగడ్డ మండలం
గతేడాది మొక్కజొన్న సాగుతో తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. పైరు చేతికందే తరుణంలో భారీ వర్షాలు, మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక పోవడంతో నష్టాలు తప్పలేదు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా మొక్కజొన్న సాగు చేయడం లేదు. వరి, పచ్చజొన్న, హైటెక్ జొన్న పంటల సాగు చేసేందుకు విత్తనాలు సమకూర్చుకుంటున్నాను.
– రాంభూపాల్‌రెడ్డి, రైతు, కోవెలకుంట్ల
కోవెలకుంట్ల: ఎలినినో ప్రభావంతో మొక్కజొన్న సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీజన్ ప్రారంభమై 20 రోజులు కావస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈఏడాది ఖరీఫ్‌లో 61,615 హెక్టార్లలో సాగు సాధారణ విస్తీర్ణం. ఇందులో జిల్లాలోని పాములపాడు మండలంలో 7,501 హెక్టార్లలో, కొత్తపల్లి మండలంలో 6,461, జూపాడుబంగ్లా మండలంలో 6,195, నందికొట్కూరు మండలంలో 5,529, ఆత్మకూరు మండలంలో 5,085, రుద్రవరం మండలంలో 4,620, మిడుతూరు మండలంలో 4,345, పగిడ్యాల మండలంలో 3,024, బనగానపల్లె మండలంలో 2,980, ఆళ్లగడ్డ మండలంలో 2,705, చాగలమర్రి మండలంలో 2,010 హెక్టార్లలో మొక్కజొన్న సాగు కావాల్సి ఉంది. వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఇప్పటి వరకు ఆయా మండలాల పరిధిలో కేవలం 451 హెక్టార్లకే సాగు పరితమైంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో సకాలంలో వర్షాలు కురుస్తాయో లేదో అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. రెండు నెలల్లో సాధారణ వర్షాపాతానికి 20 నుంచి 40 శాతం లోపే వర్షాలు కురుస్తాయని చెబుతున్నప్పటీకీ ప్రభావం అధికంగానే ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షపాత లోటుతో పంటలు సాగు చేయడం అసాధ్యమని, ఈ ఏడాది మొక్కజొన్న సాగు కష్టతరమేనని రైతులు వాపోతున్నారు. ఆగస్టులో సాధారణ వర్షాలు కురుస్తాయని చెబుతున్నప్పటికీ అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనన్నది అంచనా వేయలేకపోతున్నారు. వర్షాభావ పరిస్థితులపై వాతావరణ నిపుణులు పలుసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ రైతులకు భరోసా కల్పించేలా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు.
గతేడాది వెంటాడిన కష్టాలు..
గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలోని 54,150 హెక్టార్లలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో 55,408 హెక్టార్లలో సాగైంది. బోర్లు, బావులు, చెరువులు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తదితర సాగు నీరు వనరులు అందుబాటులో ఉండటంతో లక్ష్యానికి మించి సాగైంది. అయితే విత్తనం వేశాక వరణుడు ముఖం చాటేయడం, పైరు వివిధ దశల్లో తెగుళ్లు, పుప్పడి దశలో వేసవిని తలపించేలా ఎండలు, పంట చేతికందే తరుణంలో అధిక వర్షా లు మొక్కజొన్న రైతులను వెంటాడటంతో రైతులు కుదేలయ్యారు. ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయనుకుంటే 20 నుంచి 22 క్వింటాళ్లకే దిగుబడులు పరిమితమయ్యాయి. క్వింటా రూ. 2 వేల లోపే విక్రయించి నష్టాలు మూటగట్టుకున్నారు.
సన్నగిల్లుతున్న ఆశలు
గతేడాది జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో మే నెలలోనే విస్తారంగా వర్షాలు కురియడంతో రైతులు సకాలంలో మొక్కజొన్న పంట సాగు చేయగలిగారు. జూన్ రెండవ వారానికే 2,700 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. ఈ ఏడాది జిల్లాను కరువు, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం వెంటాడుతోంది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో సాగుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. విత్తన పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి సహకారం అందటంలేదు.
జిల్లాలో 61,615 హెక్టార్లలో
సాగు లక్ష్యం
ఇప్పటి వరకు 451 హెక్టార్లకే
పరిమితం
గతేడాది ఇప్పటికే 2,700 హెక్టార్లలో
సాగైన మొక్కజొన్న
ఈ ఏడాది వర్షాల్లేక ముందుకు
సాగని విత్తన పనులు
ఆందోళనలో అన్నదాత


