● నిజరూప దర్శనంతో భక్తులకు
కనువిందు చేసిన ప్రహ్లాదవరదుడు
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనృసింహస్వామి జయంతిని పురస్కరించుకుని పెరియాళ్వార్ తిరునక్షత్ర వేడుకులు గురువారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదవరదస్వామి దిగువ అహోబిలంలో గరుడవాహనంపై అధిష్టించి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకల్లో భాగంగా జ్యేష్ఠాభిషేకం (అభిద్యేయక అభిషేకం) వైభవంగా ప్రారంభమైంది. తొలుత ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వాములను కొలువుంచారు. పండితుల వేదమంత్రోచ్ఛారణలతో 108 కలశాలతో కూడిన విశేష తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించి జ్యేష్ఠాభిషేకం పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి స్వయం తిరుమేనితో (నిజరూప) దర్శనం ఇవ్వడంతో భక్తులు తన్మయత్వంతో దర్శించుకున్నారు.
జ్యేష్ఠాభిషేకం విశిష్టత
అహోబిలం ఆలయంలో స్వామికి ఏటా మూడురోజులపాటు జ్యేష్ఠాభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీ. దీనినే అభిద్యేయక అభిషేకం అని కూడా అంటారు. అత్యంత ప్రాచీనమైన ఉత్సవమూర్తులు అభిషేకాలతో అరుగుదలకు లోనవుతాయి. అవిక్షయానికి గురికాకుండా పరిరక్షించేందుకు వాటికి బంగారు కవచాలు తొడుగుతారు. నిత్యాభిషేకాలు ఆ కవచాల మీదుగానే నిర్వహిస్తారు. దీంతో లోపల ఉన్న విగ్రహాలు అరుగుదలకు గురికావు. ఏడాదికి ఒకసారి ఆ కవచాలను తొలగించి, లోపల ఉన్న విగ్రహాలను శుభ్రం చేస్తారు. ఈ సమయంలోనే స్వామి స్వయం తిరుమేని (నిజరూప దర్శనం) తో భక్తులకు దర్శనం ఇస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా స్వామికి రోజుకో కవచం ధరింపజేస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజు ముత్యాల కవచంతో స్వామిని అలంకరించారు. రెండో రోజు వజ్రకవచం, మూడో రోజు స్వర్ణకవచం ధరింపజేస్తారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వచ్చేంతవరకు ఈ స్వర్ణకవచంలోనే భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేక పూజలు ప్రధానార్చకుడు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.


