నంద్యాల (న్యూటౌన్): జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం(బాలురు, బాలికలు) మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ కోఆర్డినేటర్ ఎంఈ గీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టేట్ ర్యాంకు ప్రకారం ఎస్‌సీ–2 బాలికలకు 267–10,000, ఎస్‌సీ–3 వారికి 302 – 14,633, ఎస్‌టీ 947–14,678, బీసీ 02–2999 వరకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అలాగే ఎస్‌సీ–2 బాలురు 83–9996, ఎస్‌సీ–3 వారికి 3–14,504 వరకు, ఎస్‌టీ 656–14499, బీసీ 10–2500 వరకు మెరిట్ జాబితాలో ఉన్న వారు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు. బాలికలకు ఈ నెల 27న దిన్నెదేవరపాడులో ఉదయం 8.30 గంటలకు, బాలురకు ఈ నెల 29న చిన్నటేకూరులో ఉదయం 8.30 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 08518–295601 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
మెడికల్ బిల్లులు త్వరగా వచ్చేలా కృషి
బొమ్మలసత్రం: పోలీస్ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులు త్వరగా వచ్చేలా కృషి చేయాలని జిల్లా పోలీస్ పరిపాలన విభాగం సిబ్బందికి అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ భవనంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సీనియారిటీ, పదోన్నతలుకు సంబంధించిన రికార్డుల్లో అవకతవకలకు తావులేకుండా చూడాలన్నారు. సిబ్బందికి సకాలంలో రుణాలు పొందేలా అన్ని రకాల పత్రాలు నమోదు చేయాలన్నారు. ఇంక్రిమెంట్‌లు, మిస్సింగ్ క్రెడిట్ టీఏలు, శాలరీ పెండింగ్ తదితర అంశాలపై దృష్టి నిలపాలని సూచించారు. సమావేశంలో పరిపాలనా విభాగం అధికారులు వీరన్న, ఖాదర్‌వలి, కవిత, సురేష్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
24 ఏళ్ల తర్వాత రేవనూరులో మొహర్రం
కోవెలకుంట్ల: మండలంలోని రేవనూరులో 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది మొహర్రం వేడుకలు నిర్వహిస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో గ్రామంలో రెండు దశాబ్దాలకుపైగా వేడుకలు జరపలేదు. గ్రామస్తులంతా కలసికట్టుగా ఐకమత్యంతో ఈ ఏడాది మొహర్రం జరిపేందుకు ముందుకొచ్చారు. గ్రామంలోని ఉసేన్‌వలిస్వామి దర్గా సమీపంలోని పీర్ల చావిడిలో బీబీఫాతిమా, ఇమాంకాశీం, పిల్లలపీరు, అలీ అక్బర్, దస్తగిరిస్వామి, హసన్, ఉసేన్ పీర్లను కొలువుంచారు. గురువారం పెద్ద సరిగెత్తును పురస్కరించుని భక్తులు పీర్లకు ఫాతేహాలు సమర్పించారు. పెద్ద సరిగెత్తు సందర్భంగా గ్రామంలోని భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇరవైనాలుగేళ్ల తర్వాత పీర్లపండుగ నిర్వహించటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
అపరాల సాగు ఎంతో మేలు
బండిఆత్మకూరు: ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాలు, చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలని నంద్యాల ప్రాంతీయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త మంజునాథ్ సూచించారు. ఈర్నపాడు గ్రామంలో గురువారం మండల వ్యవసాయాధికారి పవన్‌కుమార్ ఆధ్వర్యంలో రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్త మంజునాథ్, డీఆర్‌సీ ఏడీ చెన్నయ్య పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరికి బదులుగా మినుము, పెసర వంటి అపరాలు, కొర్ర, సజ్జ, రాగి వంటి చిరుధాన్యాలను సాగు చేయడం లాభదాయకమన్నారు. ఆత్మ బీటీఎం ఉమామహేశ్వరి, వ్యవసాయ విస్తరణ అధికారులు లక్ష్మయ్య, వసుంధర, నాంకేబాయ్ పాల్గొన్నారు.


